Jai Bhim Is New Slogan Of TRS To Woo Dalits: దళితుల్ని ఆకర్షించేందుకు టీఆర్ఎస్ కేడర్, ఆ పార్టీ నేతలు ఇకపై ప్రతీ పబ్లిక్ మీటింగ్‌లో ‘జై భీమ్’ నినాదాన్ని పలకాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ నినాదంతో పాటు రాజ్యాంగ వ్యవస్థాపకుడైన డా. బీఆర్ అంబేద్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు టీఆర్ఎస్ అధిష్టానం అన్ని యూనిట్లకు సూచనలకు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఇంతకుముందు టీఆర్ఎస్ లీడర్స్ ‘జై తెలంగాణ’ అంటూ తమ ప్రసంగాన్ని ముగించేవారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించాక సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ‘జై భారత్’ నినాదాన్ని జోడించారు. ఇప్పుడు ‘జై భీమ్’ స్లోగన్ పలుకుతున్నారు.
గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం.. నూతన సెక్రటేరియట్‌కు బీఆర్ అంబేద్కర్ అనే పేరుని సీఎం కేసీఆర్ ఖరారు చేశారని విడుదల చేసిన ప్రకటనలోనూ చివర్లో జై భీమ్, జై తెలంగాణ, జై భారత్ అనే నినాదాలు ఉన్నాయి. అంతకుముందు సెప్టెంబర్ 13వ తేదీన కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించిన కేటీఆర్ సైతం తన ప్రసంగం అనంతరం ‘జై భీమ్’ నినాదాన్ని పలికారు. నిజానికి.. దళితుల్ని ఆకర్షించేందుకు గతేడాది నుంచే టీఆర్ఎస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో 2021 జులైలో దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్‌లో భాగంగా.. స్వతహాగా వ్యాపారం నిర్వహించుకునేందుకు ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఆ తర్వాత దళిత బంధు స్కీమ్‌ను 118 నియోజకవర్గాల్లోనూ అమల్లోనూ తీసుకొచ్చింది. కాకపోతే.. ఒక్కో నియోజకవర్గంలో కేవలం 100 దళిత కుటుంబాలే అందుకు అర్హులంటూ కండీషన్ పెట్టింది. ఇప్పుడు 1500 మంది దళిత కుటుంబాలు ఆ స్కీమ్ ద్వారా లబ్ది పొందేలా కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదండోయ్.. కొత్త సంస్థల ఏర్పాటుకు గాను దళిత పారిశ్రామిక వేత్తలకు సహాయం అందించేందుకు టీ-ప్రైడ్ సహా మరిన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. వందలాది పాఠశాలలు, కళాశాలల్ని ప్రారంభించడంతో పాటు, విదేశాల్లో మాస్టర్స్ చేసేందుకు రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందించనుంది. సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని లాంచ్ చేయబోతున్నారు కాబట్టి, దళితులపై ‘టీఆర్ఎస్ సారించిన ప్రత్యేక దృష్టి’ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.