Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే వార్తలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. జగిత్యాల నుంచి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు విజయం సాధించిన ఆయన, పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతున్న జీవన్ రెడ్డి, ఇప్పుడు తన రాజకీయ ప్రయాణాన్ని బీఆర్ఎస్ (BRS) వైపు మళ్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక అనేక బలమైన కారణాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సామాజిక సమీకరణాల వల్ల మంత్రి పదవి దక్కకపోగా, ఎమ్మెల్సీ రెన్యూవల్ కూడా జరగలేదు. అదే సమయంలో, తనను రెండుసార్లు ఓడించిన ప్రత్యర్థి డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఆయనకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. తన ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
Indiramma Canteen: రూ.5కే భోజనం.. గ్యాస్ ఇబ్బంది అస్సలే లేదు..
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యత దక్కలేదని భావించిన జీవన్ రెడ్డి, పరోక్షంగా ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చి పార్టీని ఇరకాటంలో పెట్టారు. అలాగే, రాయికల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు చైర్మన్ పదవి దక్కేలా పావులు కదిపి కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసిరారు. రాజ్యసభ సీటు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో, ఇక పార్టీలో కొనసాగడం వృథా అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తో టచ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన అనుచరులతో మాట్లాడినప్పుడు కూడా “వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే” అని వారికి సర్ది చెబుతున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ తర్వాత జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి, గులాబీ తీర్థం పుచ్చుకోవాలని ఆయన భావిస్తున్నారట. మరోవైపు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం జీవన్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ వాది అని, ఆయన పార్టీని వీడబోరని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే, జీవన్ రెడ్డి తన మనసు మార్చుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..
