Site icon NTV Telugu

Malla Reddy IT Raids: నేడు మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటీ విచారణ

Malla Reddy It Raids

Malla Reddy It Raids

IT Officials Questioning Second Day On Malla Reddy Assets: ట్యాక్స్ సరిగ్గా కట్టడం లేదన్న ఆరోపణలతో.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే! రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆ తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ తొలిరోజు విచారణ ముగియగా.. నేడు రెండో రోజు విచారణ కొనసాగనుంది. మొదటి‌రోజు ఐటీ కార్యాలయంలో‌ 12 మందిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణకు మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు. ఆ ఇద్దరిని అధికారులు ఎక్కువ సమయం విచారించారు.

మరోవైపు.. మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీలకు చెందిన ఆదాయ పన్ను వ్యత్యాసాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా.. వంద కోట్ల రూపాయల్ని అధికంగా కాలేజీ డొనేషన్లు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మొదటి రోజు మెడికల్ కాలేజీలకు చెందిన డాక్యుమెంట్లతో‌ విచారణకు హాజరైన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ‌ డైరెక్టర్లు, అకౌంటెట్లు, ఆడిటర్లు.. రెండో రోజు విచారణకూ హాజరు కానున్నారు. అయితే.. ఈరోజు విచారణకు మల్లారెడ్డి తరపున‌ ఆడిటర్లు హాజరు కానున్నారు. ఇక వీరితో పాటు కొత్తగా సమన్లు అందుకున్న పదిమందితో పాటు మరికొందరిని ఐటీ అధికారులు విచారించనున్నారు. నేడు విచారణలో భాగంగా.. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ సిబ్బంది, అకౌంటెంట్లను ఐటీ శాఖ ప్రశ్నించనుంది. తొలిరోజు విచారణలో పలువురికి ఐటి ఫార్మాట్లో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించిన ఐటీ అధికారులు.. నేడు బ్యాంక్ ఖాతాలపై విచారించనున్నారు.

కాగా.. తొలిరోజు ఐటీ అధికారులు ఐదు గంటల పాటు విచారణ సాగించారు. భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేశారు. ఈ విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు చెప్పామని, ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారని అన్నారు. అవసరమైతే తాము మరోసారి కూడా విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారన్నారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారని, తాము చెప్పిన సమాధానాలతో వాళ్లు సంతృప్తి చెంది ఉంటారని చెప్పారు.

Exit mobile version