IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

  • పూణే నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
  • పైలట్ అప్రమత్తతతో సేఫ్‌గా ల్యాండింగ్
  • విమానం ముందు భాగంలో సొట్ట గుర్తింపు
  • చండీగఢ్ వెళ్లాల్సిన సర్వీస్ రద్దు  
Indigo

Indigo

హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పూణే నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6ఈ352 (IndiGo 6E 352) విమానాన్ని గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టినట్లు పైలట్ అనుమానం వ్యక్తం చేశారు. ల్యాండింగ్ సమయంలో పక్షి విమానాన్ని తాకినట్లు గ్రహించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో లోపల ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విమానం ముందు భాగంలో సొట్ట.. నిపుణుల తనిఖీలు

విమానం సురక్షితంగా నిలిచిన అనంతరం ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని నిశితంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో విమానం ముందు భాగంలో ఒక సొట్ట పడినట్లు అధికారులు గుర్తించారు. పక్షి ఢీకొట్టడం వల్లే ఈ డ్యామేజ్ జరిగిందని సాంకేతిక బృందం నిర్ధారించింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించిన తర్వాత విమానాన్ని సమగ్ర తనిఖీల కోసం కేటాయించారు.

చండీగఢ్ సర్వీస్ రద్దు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

షెడ్యూల్ ప్రకారం ఈ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి చండీగఢ్ వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలు, విమానం ముందు భాగం దెబ్బతినడంతో చండీగఢ్ వెళ్లే సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఆ విమానంలో ప్రయాణించాల్సిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ప్రత్యామ్నాయ విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.