I Will Reveal The Conspiracy Behind KCR BRS Party Says Kodandaram: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కొత్తగా స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ కుట్రలను తాను త్వరలోనే బహిర్గతం చేస్తానని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగమన్న ఆయన.. ఆ పార్టీలోని డొల్లతనాన్ని ఢిల్లీలో స్థాయిలో తాను బయటపెడతానని పేర్కొన్నారు. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డ కోదండరామ్.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి వారికి కచ్చితమైన సిద్ధాంతాలు ఉన్నాయని.. ఆ దిశగానే ఆర్థిక నమూనాను తయారు చేశారని అన్నారు. వారి పేర్లను వల్లె వేస్తున్న కేసీఆర్‌కు.. ఆ రెండూ లేవని విమర్శించారు. తన తక్షణ రాజకీయ అవసరాల గురించే కేసీఆర్ ఆలోచిస్తారని ఆరోపించారు.
తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు ‘జాతీయ పార్టీ’ పేరుతో నాటకాలు ఆడుతున్నారని.. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం అధికారాన్ని అడ్డంగా వాడేసుకుంటున్నారని కోదండరామ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నానని కేసీఆర్ చెప్పుకుంటూ ఉంటారని.. మరి తమ ఆస్తులు పెంచుకునేంత సమయం వారికి ఎలా దొరికిందని నిలదీశారు. రాష్ట్రంలోని అసలు సమస్యల్ని కేసీఆర్ పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తన వైఫల్యాలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబ నియంత్రణలో నలుగురు చనిపోతే.. దానిపై అసలు చర్చలే చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోయయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితితో ఒరిగేదేమీ లేదని, పార్టీ పేరు మార్పిడి ఒక పెద్ద మోసమని అన్నారు. కాగా.. మునుగోడు ఉపప ఎన్నికల్లో టీజేఎస్ కూడా పోటీ చేస్తోందన్న కోదండరామ్.. త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.