CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!

  • ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవనానికి సీఎం అభినందనలు
  • ఆక్రమణల తొలగింపుతో మారుతున్న హైదరాబాద్
  • ప్రజా ఆస్తుల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం
  • భావితరాల కోసం జలవనరుల పరిరక్షణపై దృష్టి
Cm Revanth Reddy

Cm Revanth Reddy

హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు , జలవనరుల పునరుజ్జీవం కోసం పనిచేస్తున్న హైడ్రా (HYDRAA) వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణతో మహానగరం సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటోందని, ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఉప్పల్ నల్ల చెరువుకు జీవం.. హైడ్రా బృందానికి ప్రశంసలు

ప్రధానంగా ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవనం కోసం అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు , సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కబ్జాలు, వ్యర్థాలతో కళాహీనంగా మారిన చెరువులను ప్రణాళికాబద్ధంగా శుభ్రం చేసి, మళ్లీ జీవం పోస్తుండడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. భావి తరాలకు స్వచ్ఛమైన, జీవంతో నిండిన పర్యావరణాన్ని, భద్రమైన భవిష్యత్తును అంకితం చేయడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

ప్రజా ఆస్తుల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం

చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, రాబోయే తరాల భవిష్యత్తును భద్రపరచడమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగరంలో ఆక్రమణలకు గురైన ప్రతి చెరువును కాపాడుతూ, ప్రభుత్వానికి చెందిన ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలు నగరానికి సరికొత్త శోభను తీసుకువస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.