HYDRA : హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో హైడ్రా మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. మొండికుంట చెరువు , దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి విముక్తం చేస్తూ గురువారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ చర్యలో భాగంగా సుమారు 11 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ ఆస్తి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 2200 కోట్లు ఉంటుందని హైడ్రా ప్రాథమికంగా అంచనా వేసింది.
సర్వే నంబర్ 53లోని మొండికుంట చెరువు పరిధి , సర్వే నంబర్ 55లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏళ్ల తరబడి అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు FTL పరిధిలోని ఒక ఆలయాన్ని హద్దుగా చూపించి, కబ్జాదారులు తెలివిగా ఆక్రమణలకు పాల్పడ్డారు. అక్కడ వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా పక్కా షాపులను నిర్మించి, వాటి ద్వారా నెలకు లక్షలాది రూపాయల అద్దెలు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీటిలో ప్రధానంగా మెకానిక్ షెడ్లు, ఐరన్ , స్టీల్ దుకాణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, జేసీబీలతో వాటిని నేలమట్టం చేశారు.
Parijatha Yogam 2026: రేపే పారిజాత యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు.!
ఈ ఆక్రమణల నిర్ధారణ కోసం హైడ్రా శాస్త్రీయ పద్ధతులను అనుసరించింది. ఈ ఏడాది జనవరి 31న రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా, ఎన్ఆర్ఎస్సీ (NRSC) శాటిలైట్ చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించింది. గత కొన్ని ఏళ్లలో చెరువు ఆక్రమణకు గురైన తీరును శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిర్ధారించుకున్నాకే ఈ చర్యలకు పూనుకుంది. అయితే, ఈ కూల్చివేతలకు ముందే కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి, సామాగ్రిని తరలించుకోవడానికి గడువు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు జరిగాయి. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ 11 ఎకరాల స్థలంలో ప్రజా అవసరాల కోసం పార్కులు అభివృద్ధి చేయాలని, అలాగే మొండికుంట చెరువును ప్రక్షాళన చేసి సుందరీకరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
