Hyderabad: హోటల్‌లో వెంటపడిన కుక్క.. మూడో అంతస్తుపై నుంచి పడి యువకుడి మృతి..

  • చందానగర్ లో కుక్క తరమడంతో మూడో అంతస్తుపై నుంచి పడి యువకుడి మృతి..
  • చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ హోటల్లో ఘటన..
  • సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు.. విచారణ చేస్తున్న పోలీసులు..
Chanda Nagar

Chanda Nagar

Hyderabad: చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. హోటల్‌లో కుక్క వెంట పడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్‌ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీ ప్రైడ్‌ హోటల్‌కు అతడు వెళ్లాడు. హోటల్‌ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఉదయ్‌ వెంట పడటంతో.. దాని నుండి తప్పించుకునే క్రమంలో హోటల్‌ కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు ఉదయ్.

Read Also: Haripriya Naik: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు..

ఇక, ఉదయ్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హాస్పిటల్ కు అతడి స్నేహితులు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు రాకుండ జాగ్రత్త పడ్డారు పోలీసులు. అసలు హోటల్ మూడవ అంతస్తులోకి కుక్క ఎలా వచ్చింది అనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.