Balapur Ganesh Laddu Auction: జైజై గణేశా..బైబై గణేశా…గణపతి బప్పా మోరియా..హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే స్లోగన్స్ మార్మోగుతున్నాయి.ఖైరతాబాద్ గణేషే కాదు బాలాపూర్ లడ్డూ వరల్డ్ ఫేమస్. హైదరాబాద్‌లో మహా నిమజ్జనం అంటే తొలుత అందరి చూపు బాలాపూర్ లడ్డూవైపే.ఈసారి వేలం ఎంత ఉత్కంఠగా జరుగుతోంది.లడ్డూ ధర ఎంత పలుకుతోంది?సరికొత్త రికార్డ్ బ్రేక్ అవుతుందా? ఎవరి నోట విన్నా ఇదే మాట. బాలాపూర్ గణపతి లడ్డూ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో పలుకుతూ ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ లడ్డూ చరిత్ర ఎంతో ఘనమైంది.దీన్ని కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనేది సెంటిమెంట్.లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకుంటే, వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.అందుకే దీన్ని దక్కించేందుకు పెద్దయెత్తున పోటీపడతారు.
బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానికుడు కొలను మోహన్‌రెడ్డి గెలుపొందారు.అతను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లాడు. ఆ కుటుంబానికి, కొలను మోహన్‌రెడ్డికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డూ పొందడం ద్వారానే బాగా కలిసొచ్చిందని భావించిన మోహన్‌రెడ్డి, మరుసటి ఏడాది 1995లో మళ్లీ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నాడు. అప్పుడు వేలం ధర రూ.4,500. ఆ సంవత్సరం కూడా లడ్డూ పొందిన అతడికి అన్ని విధాలా కలిసొచ్చింది.ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా ఎదిగింది. దీంతో బాలాపూర్ లడ్డూకు చాలా మహిమ ఉందని భక్తుల్లో నమ్మకం ఏర్పడింది.
ఇలా 1994లో రూ.450తో మొదలైన లడ్డూ వేలం పాట, వందలు, వేలు దాటి ఏటేటా కొత్త రికార్డులతో లక్షలు పలుకుతోంది. 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ.1,05,000కు లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి 4,15,000 రూపాయలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు. 2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్‌రెడ్డి రూ.10,32,000 లకు లడ్డూను దక్కించుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన బాలాపూర్ వేలంలో అత్యధికసార్లు కొలను వంశస్తులే దక్కించుకోవటం హైలైట్. 2023లో రూ.27 లక్షలకు లడ్డూ వేలం ధర పలకింది.2024లో అంచనాలకు తగ్గట్టు రూ.30.01 లక్షలకు కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నాడు. దీంతో తొమ్మిది సార్లు కొలను కుటుంబమే ఆ మహా ప్రసాదాన్ని సొంతం చేసుకుంది.
గతేడాది ఎంతో ఉత్కంఠగా లడ్డూ వేలంపాట సాగింది. ముగ్గురు స్థానికేతరులతో నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడి కొలను శంకర్ రెడ్డి విజేతగా నిలిచాడు. ఈసారి ఎంత పలుకుతుందనేది ఆసక్తికరంగా మారింది.నిజానికి బాలాపూర్ లడ్డూ వేలం సెంటిమెంట్ భాగ్యనగరంలోని మిగతా మండపాలకు సైతం ఇన్‌స్పిరేషన్ అయింది. అపార్ట్‌మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో సైతం గణేష్ లడ్డూలు వేలం పాటల్లో రికార్డ్ స్థాయి ధరలు పలుకుతున్నాయి.అయినా బాలాపూర్ లడ్డూ వేలమే నెక్ట్స్ లెవల్..అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రే.
గణపతి నవరాత్రుల ప్రారంభం రోజే.. బాలాపూర్ లడ్డూ వేలం పాటలో పాల్గొనే వారి నుంచి దరఖాస్తులను స్వీకరణ మొదలైంది. ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు వినాయకుడి నిమజ్జనం రోజు ఉదయం 7.00 గంటలకు ముగిసింది. ఈ లడ్డూ వేలం పాట తొలుత రూ. 1116లతో ప్రారంభమవుతుంది. వేలంపాటలో ఈ లడ్డూ దక్కించుకున్న వారు బాండ్‌పై సంతకం చేసి.. వచ్చే ఏడాది వేలంపాటలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన నగదును గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు బాలాపూర్ ఉత్సవ కమిటీ ఖర్చు చేస్తుంది. బాలాపూర్ విగ్రహం ఎత్తు కంటే.. గణేషుడి చేతిలో ఉంటే లడ్డూపైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే, వేలం పాటలో ఆ లడ్డూ బద్దలుకొట్టబోయే రికార్డుల కోసం ఎదురుచూస్తుంటారు. బాలాపూర్ లడ్డూని దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీపడుతుంటారు. లక్షల రూపాయలైనాసరే లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
2024లో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రూల్ బుక్ మారింది. వేలంలో పాల్గొనాలనుకునేవాళ్లు గతేడాది వేలం మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. అంటే, గతేడాది ఎంత పలికితే అంటే..30లక్షల ఒక వెయ్యి రూపాయల ధరావత్తు కడితేనే లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ రూల్ స్థానికేతరులకు మాత్రమే ఉండేది.గతేడాది నుంచి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. వేలం పాటకు పోటీ తీవ్రంగా ఉన్నందునే ఈ నిబంధన తీసుకొచ్చారు నిర్వహకులు. 31ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలం పాట ముగియగానే ట్యాంక్‌బండ్ వైపు శోభాయత్ర మొదలవుతుంది. ఇక్కడితో మొదలయ్యే భాగ్యనగర గణేష్ శోభాయాత్రకు ఏడు దశాబ్దాల చరిత్ర వుంది.అందకే సాగరమంత జనం మధ్య జరిగే మహా నిమజ్జనం వరల్డ్ ఫేమస్. బాలాపూర్ లడ్డూ వేలం ఎంతకు పోయిందని తెలుసుకుంటేనే పండుగలో అసలైన భక్తిభావం ఉప్పొంగుతుంది. ఆ తర్వాత ఖైరతాబాద్ గణేషుడి మహా నిమజ్జనం చూసి తరిస్తేనే సంబరం సంపూర్ణం.
