Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల విచిత్రమైన పొరపాటు చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోసం సిద్ధం చేసిన గౌరవ వందనాన్ని పొరపాటున ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి అందించారు. సహరాన్‌పూర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సహరాన్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు శనివారం ఉదయమే అక్కడికి చేరుకుని గౌరవ వందనానికి ఏర్పాట్లు చేశారు. అయితే, న్యాయమూర్తి ఇంకా అక్కడికి చేరుకోకముందే అసదుద్దీన్ ఒవైసీ సర్క్యూట్ హౌస్‌కు వచ్చారు. ఆయన రాక ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో భాగంగా లేకపోవడంతో పోలీసులు గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి కోసం సిద్ధంగా ఉన్న పోలీసు సిబ్బంది ఒవైసీనే జడ్జిగా భావించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఒవైసీ కూడా నిలబడి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి ఒవైసీ పర్యటన..
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి సహరాన్‌పూర్‌లో పర్యటించారు. ఇద్దరు నేతలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చారు. ఇటీవలే ఈ ఇద్దరు నేతలు కలిసి ‘సామాజిక పరివర్తన్ మోర్చా’ (SPM) పేరుతో ఉమ్మడి రాజకీయ కూటమిని ప్రకటించారు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి పోటీ చేయనుంది.

విచారణకు ఆదేశించిన ఎస్ఎస్పీ..
ఈ ఘటనపై సహరాన్‌పూర్ పోలీసులు స్పందించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఆదేశాల మేరకు ఎస్పీ (రూరల్) ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనున్నారు. విచారణలో సేకరించిన వాస్తవాలు, ఆధారాల ఆధారంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటనలో వెల్లడించారు. అయితే, గౌరవ వందనం అనేది సైనిక లేదా పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా నియమించిన ప్రముఖులు, ఉన్నతాధికారులకు అధికారిక కార్యక్రమాల్లో అందించే సంప్రదాయ గౌరవ సూచకం. సిబ్బంది వరుసగా నిలబడి క్రమశిక్షణతో సెల్యూట్ చేస్తారు. అయితే, ఈ గౌరవ వందనం ఎవరికి ఇవ్వాలనే విషయంలో జరిగిన పొరపాటు ఇప్పుడు పోలీసు శాఖలో చర్చకు దారితీసింది. ఒక న్యాయమూర్తి కోసం ఏర్పాటు చేసిన గౌరవ వందనం మరో వ్యక్తికి అందించడం పోలీసుల సమన్వయం, గుర్తింపు ప్రక్రియలో లోపాలను ప్రశ్నించేలా చేసింది.