Site icon NTV Telugu

Hyderabad Population: కోటి దాటిన హైదరాబాద్ జనాభా.. ప్రస్తుతం ఎంతో తెలుసా?

Hyderabad

Hyderabad

Hyderabad Population: హైదరాబాద్‌ నగరం అన్ని మతాలకు ఆతిథ్యమిచ్చే మహానగరం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల వారు జీవిస్తూ ఉంటారు. అందుకే భాగ్యనగరాన్ని మినీ ఇండియా అని అంటారు. హైదరాబాద్‌ మరో మైలు రాయిని చేరుకుంది. భాగ్యనగరం జనాభా ప్రస్తుతం 1.05 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 1.08 కోట్లకు చేరుతుందని ఐరాస అంచనా వేసింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 నగరాల్లో హైదరాబాద్‌ చోటు దక్కించుకుంది. జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో దేశంలో 6వ స్థానం, ప్రపంచంలో 34వ స్థానంలో హైదరాబాద్ ఉంది. పట్టణీకరణ పెరగడం వల్ల తెలంగాణ జనాభాలో మూడో వంతు హైదరాబాద్‌లోనే నివసిస్తోంది.

Read Also: Eid-ul-Fitr: కనిపించిన నెలవంక.. దేశంలో రేపే రంజాన్..

1950లో హైదరాబాద్‌ జనాభా 10 లక్షలు మాత్రమే. ఆ తర్వాత 1975 నాటికి జనాభా 20 లక్షలు దాటింది. 1990నాటికి 40 లక్షలకు చేరింది. 2010 నాటికి జనాభా 80 లక్షలు దాటింది. ఏటా 5 లక్షల మంది ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. వారిలో చాలామంది ఇక్కడే స్థిరపడుతున్నారు. వారిలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య ఏటా సగటున 4.07 లక్షలుగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏటా సగటున 88,216 మంది భాగ్యనగరానికి ఉపాధి కోసం వలస వస్తున్నారు. హైదరాబాద్‌ అంటే ఎంసీహెచ్‌ పరిధిలోని 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే. జీహెచ్‌ఎంసీ ఏర్పాటుతో 650 చదరపు కిలో మీటర్ల పరిధికి విస్తరించింది. అవుటర్‌ రింగ్‌రోడ్డు వరకు పరిగణనలోకి తీసుకుంటే 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. ప్రతీ ఏటా 5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. హైదరాబాద్‌ జనాభాలో 14 ఏళ్లలోపు పిల్లలు 25 శాతం ఉన్నారు. 60 శాతంపైగా జనాభా 15 నుంచి 64 ఏళ్ల మధ్యలో ఉంది.

Exit mobile version