Bhavishyavani: లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న (ఆదివారం) అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. నిన్న తెల్లవారు జామున ప్రభుత్వం తరుపున మొదటి బోనం సమర్పించడంతో అమ్మవారి బోనాల ప్రక్రియ ప్రారంభమయ్యాయి. లక్షలాది భక్తుల మొక్కులు, వేలాది బోనాల సమర్పణతో మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి.
Read also: Astrology: జులై 22, సోమవారం దినఫలాలు
పోత రాజుల ఆటపాటలతో ఫలహారం బండి ఊరేగుంపులతో ఈ రోజు తెల్లవారు జామున తొలి రోజు బోనాల సంబరాలు ముగిసాయి. మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ రెండో రోజు కొనసాగుతుంది. వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి భక్తులు మొక్కులు సమర్పించుకుంటున్నారు. రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారీ పై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతరతో నేడు ముగియనుంది. పచ్చి కుండ పై నిలబడి జోగినీ (స్వర్ణలత) చెప్పే భవిష్యవాణి పై భక్తుల ఆశక్తి చూపుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల తరువాత రంగం భవిష్యవాణి ఉండే అవకాశం ఉంది.
Read also: Dowleswaram Barrage: ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ఉధృతి
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసిన సీఎం మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ పండితులు సీఎంకు వేదమంత్రోచ్ఛరణల నడుమ దీవించి.. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పండితులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి శేష వస్త్రంను సీఎంకు అందించారు. సీఎం రాకతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.