VRO: భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో వీఆర్వోలు గ్రామాలకు తిరిగి రానున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన భూభారతి బిల్లుల్లో గ్రామస్థాయిలో కొత్త రెవెన్యూ అధికారులను నియమిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మళ్లీ వీఆర్వో విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామాల్లో పని చేసేందుకు రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియను ప్రారంభించింది. సర్వేయర్ల నియామకంపైనా దృష్టి సారించింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసి ఇతర విభాగాలకు బదిలీ అయిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని 10,954 రెవెన్యూ గ్రామాలకు నియమించనున్నారు. అలాగే సర్వేయర్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించారు.
Read also: High Court: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు బిగ్ రిలీఫ్..
గూగుల్ ఫారమ్‌లలో వివరాలను నింపాలని, జిల్లాల వారీగా కలెక్టర్లు వివరాలను సేకరించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లాలనుకునే వారందరికీ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ ఫారం ద్వారా పూర్తి వివరాలను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో గ్రామస్థాయి అధికారులతో పాటు సర్వేయర్‌గా కూడా పనిచేసేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఉన్న వీఆర్వోల పూర్తి వివరాలను ఆప్షన్ల ద్వారా సేకరిస్తున్నారు. మీరు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు? ఏ విభాగంలో? ఉద్యోగి ఐడీ? ప్రస్తుత పోస్ట్‌లో నియామకం తేదీ? రెవెన్యూ శాఖలో చేరిన తేదీ? విద్యార్హతలు, ఏ జిల్లా? మీరు ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారు? ఇలాంటి వివరాలు అడిగారు. సర్వేయర్‌గా పనిచేయాలంటే తప్పనిసరిగా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ (ఎంపీసీ) పూర్తి చేసి ఉండాలనే షరతు విధించారు. ఈ నెల 28లోగా వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎస్‌ఏ) హర్షం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, కార్యదర్శి వి.భిక్షం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అధికారుల రాకతో రెవెన్యూ వ్యవస్థ పటిష్టం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Allu Arjun Silent: విచారణలో వీడియోలు.. నోరు మెదపని అల్లు అర్జున్..