Hyd Metro: హైదరాబాద్ మహా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు అవరోధం ఎదురైంది. చారిత్రక చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి మెట్రో నిర్మాణ పనులు చేపట్టొ్ద్దని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును సమర్పించాలని ప్రభుత్వాన్నికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా కారిడార్-6 పనులను వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించి ఎలాంటి సర్వే చేయకుండానే ప్రారంభిస్తున్నారని యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన బెంచ్ విచారణ చేసింది.
Read Also: PM Modi: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ
ఇక, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మెట్రో రెండో దశ పనుల వల్ల చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్‌తో పాటు పురానీ హవేలి, దారుల్‌షిఫా మసీద్, మొగల్‌పురా టూంబ్ లాంటి అనేక చారిత్రక కట్టడాల భద్రతకు ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. వారసత్వ కట్టడాలపై పడే ప్రభావంపై సమగ్రమైన అధ్యయనం చేయకుండా పనులు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. హెరిటేజ్ పరిరక్షణ నిపుణులు, పట్టణ ప్రణాళికా విభాగం నిపుణులు, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలతో కూడిన ఓ కమిటీ ద్వారా అధ్యయనం చేయించాలని యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపు అడ్వకేట్ కోరారు.
Read Also: Road Accident: కర్ణాటకలో రోడ్డుప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల మృతి
అయితే, తెలంగాణ వారసత్వ కట్టడాల పరిరక్షణ చట్టం, కేంద్ర పురావస్తు శాఖ చట్టంలోని రూల్స్ ప్రకారం అవసరమైన పర్మిషన్లు పొందిన తర్వాతే పనులు ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఇక, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి 3 వారాల సమయం కావాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనికి హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ జరిగే వరకు చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద మెట్రోకు సంబంధించిన ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని వెల్లడిస్తూ.. విచారణను వాయిదా వేసింది.
