NTV Telugu Site icon

Rythu Bharosa: అన్నదాతలకు శుభవార్త.. రైతు భరోసా నిధులు విడుదల

Rythubharosa

Rythubharosa

తెలంగాణ అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు పడ్డాయి. రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొత్తం రూ. 1126.54 కోట్లు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే రైతుబంధుకు రూ. 7625 కోట్లు, రుణమాఫీకి రూ. 20,616.89 కోట్లు, రైతు భీమాకు 3000 కోట్లు విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

ఎన్నడూలేని విధంగా రూ. 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించినట్లు తెలిపారు. ప్రత్తి పంటను పూర్తిగా సేకరించడానికి మంత్రి తుమ్మల గడువు కోరారు. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు పంటలను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల దగ్గర నుంచి మద్ధతు ధరకు కోనుగోలు చేసినట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు వచ్చాయన్నారు. యాసంగిలో 10,547 కోట్లతో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, ఖరీఫ్‌లో 12,178.97 కోట్లతో 52.51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి కొన్న ప్రభుత్వం. అందుకు 1154 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగింపు ఉంటుందని చెప్పారు. పసుపు, మిరప పంటలకు మద్దతు ధర నిర్ణయించడానికి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొ్న్నారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంది చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతే అని మంత్రి అన్నారు.