NTV Telugu Site icon

PM Modi Call To Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్.. పూర్తిస్థాయి సహకారం ఉంటుందని హామీ

Modi Revanth

Modi Revanth

PM Modi Call To Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్‌ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్‌లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం.. ఇక, సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని కూడా ప్రధాని వివరించారు.. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ను పంపిస్తామని సీఎంకు చెప్పారు ప్రధాని మోడీ.. క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చేందుకు… పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ..

Read Also: ENG vs AUS: బెన్‌ డకెట్‌ ఊచకోత.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

కాగా, నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని.. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డీఐజీ, ఐజీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మరోవైపు.. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిన విషయం విదితమే.. మరోవైపు.. ఎన్డీఆర్ఎఫ్ అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ దుర్ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.