హైదరాబాద్ నగరంలో మీరు పార్కులకు వెళ్తున్నారా? అయితే మీ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుభవార్త తెలిపింది. సంజీవయ్య, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లే పర్యాటకుల వద్ద కెమెరాల కోసం ఇకపై ఫీజులు వసూలు చేయబోమని HMDA వెల్లడించింది. గతంలో ఈ మూడు పార్కుల్లోకి కెమెరాతో వెళ్తే అదనంగా రూ.1000 వసూలు చేసేవారు. ఇప్పుడు కెమెరాలకు, వీడియో కెమెరాలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని HMDA ప్రకటించింది.
ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ తెలిపింది. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమలు చేస్తామని HMDA స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
