కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో సగం జనాభా.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జనాభా ఉన్నారని తెలిపారు. సగం జనాభా ఉన్న చోట ఒక్క మంత్రి కూడా లేడన్నారు. గెలిచిన వాళ్లలో తాను ఒక్కడినే ఉన్నట్లు చెప్పారు. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని పేర్కొన్నారు. సామాజిక వర్గాలకు న్యాయం జరగడం లేదు అనుకుంటే.. తన స్థానంలో ఎవరిని గెలిపించమంటే వాళ్లను గెలిపిస్తానని ప్రకటించారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవాళ్లు అని గుర్తుచేశారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానిక నేతలకు మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇక పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలి.. కానీ పదవులు ఇవ్వొద్దు అని కోరారు. కొత్తగా చేరిన వాళ్లను మంత్రులుగా తీసుకోవద్దని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టడం సరైంది కాదని హితవు పలికారు. కనీసం పదేండ్లు కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.