Hyderabad Fog: హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇవాళ ( జనవరి 2న) ఉదయం దట్టమైన పొగమంచుతో కమ్మేశాయి. తెల్లవారుజాము నుంచి కనిపించిన ఈ పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు పూర్తిగా కాశ్మీర్ లోయను తలపించేలా కనిపించాయి. రోడ్లు, చెట్లు, భవనాలు పొగమంచు తెర వెనక కనుమరుగు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవే తో పాటు శామీర్‌పేట్, మేడ్చల్, తూముకుంట, షామ్షాబాద్, ఆదిబట్ల, గండిపేట, మోకిల, కొంపల్లి, సంగారెడ్డి, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, కిస్మత్ పూర, పటాన్ చెరు, ఆర్సీపుర్, వికారాబాద్ వైపు వెళ్లే శివారు ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల వరకు దృశ్యమానత (విజిబిలిటీ) బాగా తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Read Also: Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
అయితే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవేతో పాటు పలు ప్రధాన రహదారుల వాహనదారులు ఉదయం 8 గంటలు అయినా పొగ మంచుతో 10 అడుగుల దూరం ఉన్న వాహనాల రాకపోకలు కనిపించకపోవడంతో.. లైట్లు వేసుకొని తమ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాయి. ఇక, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం డిపో సేఫ్టీ అధికారి వెంకటేశం సూచనలు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ ఎత్తున అటవీ ప్రాంతం ఉండడంతో రోజువారీ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటుంది.
Read Also: Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!
అలాగే, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, కిస్మత్ పూర్, ఔటర్ రింగు రోడ్డుతో పాటు వికారాబాద్ వైపు జాతీయ రహదారి మొత్తాన్ని పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచుతో తీవ్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముందు వెళుతున్న వాహనాలు కనిపించక పోవడంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి నెలకొంది. ఫాగ్ లైట్స్ వేసినప్పటికి రహదారి కనిపించడం లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అహ్లాదకరమైన వాతావారణాన్ని మార్నింగ్ వాకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టులో పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రద్దు అయింది. అలాగే, శంషాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానం అలస్యంగా నడుస్తుంది. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలోని ముంబై జాతీయ రహదారి ఆర్సీపురం నుంచి పటాన్ చెర్వు మీదుగా ఇస్నాపూర్, రుద్రారం, ముత్తంగి, ఇంద్రేశం వరకు పొగ మంచు కమ్మేసింది. ఈ పొగ మంచు వల్ల విద్యార్థులు, ఉద్యోగస్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
