Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!

  • ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాలకు షాక్
  • ఏప్రిల్‌లో 6 FIR లు ఫైల్
Cybercrime

Cybercrime

Cyber Crime: ఐపీఎల్ సీజన్‌ను అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇచ్చారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా అక్రమ బెట్టింగ్ యాప్‌లు, నకిలీ పెట్టుబడి స్కీమ్‌లను ప్రమోట్ చేస్తున్న 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పోలీసులు గుర్తించి, వాటిని తొలగించారు. వివరాల్లోకి వెళ్తే..

ఏప్రిల్ నెలలో భారీ ఆపరేషన్..
ఈ ఏప్రిల్ నెలలో సైబర్ క్రైమ్ యూనిట్ నిర్వహించిన ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుమారు 801 పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్లను నడుపుతున్న 181 ప్రొఫైల్స్‌ను పోలీసులు గుర్తించారు. ఈ అకౌంట్స్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్ అంచనాలు, భారీ బోనస్‌లు, రెఫరల్ కమిషన్ల పేరుతో అమాయకులను ఆకర్షిస్తున్నారు. చివరికి ప్రముఖ వ్యక్తుల ఫోటోలు, వీడియోలను ‘డీప్‌ఫేక్’ సాంకేతికతతో మార్పింగ్ చేసి, వారు కూడా ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టమని కోరుతున్నట్లు జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏప్రిల్ నెలలో మొత్తం 6 FIR లు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం మీద 427 ప్రొఫైల్స్, 1903 పెయిడ్ ప్రమోషన్లను సైబర్ పోలీసులు నెట్ నుంచి తొలగించారు. మిగిలిన అనుమానాస్పద అకౌంట్లపై కూడా దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే వాటిని క్లోజ్ చేయించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కీలక సూచనలు చేసిన పోలీసులు
తెలంగాణలో ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్ పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను కోరారు. అనధికారిక బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని చెప్పారు. సెలబ్రిటీలు పెట్టుబడి స్కీమ్‌లను ప్రోత్సహిస్తున్నట్లు వచ్చే వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లలు ఆన్‌లైన్ జూదం వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని అన్నారు.