NTV Telugu Site icon

TS High Court: దుర్గం చెరువు పరిసర వాసులకు హైకోర్టు ఊరట.. కూల్చివేతలపై స్టే..

High Court

High Court

TS High Court: తెలంగాణ హైకోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. దుర్గం సరస్సు ప్రాంత నిర్వాసితులు అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరుకావాలని పేర్కొన్న కోర్టు.. అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల్లోగా తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర వాసులకు ఊరట లభించింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూకట్‌పల్లిలోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌లోని బఫర్‌ జోన్‌లో నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. నేడు మాదాపూర్‌లో కూల్చివేతలను కొనసాగిస్తోంది. కావూరి హిల్స్‌ పార్క్‌లోని అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్క్‌లోని స్పోర్ట్స్‌ అకాడమీపై కావేరి హిల్స్‌ అసోసియేషన్‌ గత కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాలను తొలగించిన అధికారులు కావేరి హిల్స్ పార్క్ అనే బోర్డును ఏర్పాటు చేశారు.
Kaleshwaram Commission: రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్..

Show comments