Site icon NTV Telugu

Ganesh Nimajjanam 2025: దారులన్నీ సాగరం వైపే… గణేష్‌ నిమజ్జనం అంటే హైదరాబాదే..

Ganesh

Ganesh

Ganesh Nimajjanam 2025: లంబోదరుడి నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ ముస్తాబైంది. మహా నగరంలో గణేశ్ నిమజ్జనాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రూ.54 కోట్లతో నగరవ్యాప్తంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది. గణేశ్ ఉత్సవ సమితులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ తోపాటు 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దాదాపు లక్షా 50 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా.. ఇవాళ్టి మహాక్రతువులో ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్‌లతో సహా దాదాపు 50 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ సహా వివిధ శాఖలతో ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. 15 వేల మంది సిబ్బందితో గణేశ్ నిమజ్జనానికి సిద్ధమైన బల్దియా… 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాఫీగా, వేగంగా జరిగేలా 11 పెద్ద క్రేన్లతో సహా 40క్రేన్‌లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుండగా… ట్యాంక్ బండ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేశ్‌ నిమజ్జనం చేయనున్నారు.

Read Also: Imran Khan: జైలు దగ్గర ఇమ్రాన్‌ఖాన్ సోదరిపై కోడిగుడ్డు దాడి.. వీడియో వైరల్

హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఊరేగింపులతో గణనాథులు హుస్సేన్ సాగర్‌కు తరలి వస్తున్నారు. ఊరేగింపు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే 160 యాక్షన్ టీమ్‌లను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ… ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లను అమర్చింది. మరోవైపు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపింది. సుమారు 3 వేల మంది కార్మికులు వ్యర్థాల తొలగింపులో నిమగ్నమయ్యారు. అలాగే హైడ్రా, పర్యాటక శాఖల సమన్వయంతో హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. పోలీసు శాఖ సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి నిమజ్జానికి తరలివచ్చే భక్తులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూసేలా ఏర్పాట్లు చేశారు.

Read Also: Priya Prakash : పదునైన అందాలతో ప్రియా వారియర్ రచ్చ

బాలాపూర్ నుండి శోభాయాత్రగా బయలుదేరే బాలాపూర్ గణపతి విగ్రహం చార్మినార్ , అబిడ్స్ ,లిబర్టీ , ట్యాంక్ బండ్ మీదుగా నక్లెస్ రోడ్ కు చేరుకుంటుంది. నక్లెస్ రోడ్ వద్ద హుస్సెన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తారు. సికింద్రాబాద్ నుండి హుస్సెస్ సాగర్ వైపు తరలి వచ్చే గణేష్ విగ్రహాలు ప్యాట్నీ , ప్యారడైజ్ , రాణిగంజ్, కర్బలా మైదాన్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటాయి. ఎల్బీనగర్ మీదుగా వచ్చే గణపతి విగ్రహాలు దిల్ షుక్ నగర్ , అంబర్ పేట్, నారాయణ గూడ, ఉప్పల్ మీదుగా వచ్చి లిబర్టీ వద్ద శోభాయాత్రలో కలసి అక్కడి నుండి నేరుగా హుస్సెన్ సాగర్ వద్దకు చేరుకుంటాయి. టోలీ చౌకీ , మెహదీపట్నం మీదుగా వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం పాయింట్ వద్దకు చేరుకుంటాయి. ఆసీఫ్ నగర్ నుండి వచ్చే విగ్రహాలు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో కలుస్తాయి.

Read Also: Temple : మాయమైన హుండీ డబ్బులు ప్రత్యక్షం.. అంతా మిస్టరీ

మరోవైపు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 10 గంటల వరకూ ఇతర వాహనాలను నగరంలోకి అనుమతించరు. సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ బస్సులకు కూడా ఆంక్షలు తప్పలేదు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను చాదర్ ఘాట్ వైపు దారి మళ్లించనున్నారు. నిమజ్జనం సమయంలో ఇబ్బందులు తలెత్తితే … వాటిపై స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు..

Exit mobile version