ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఈడీని మాజీ మంత్రి కేటీఆర్ సమయం కోరారు. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు టైం ఇవ్వాలని ఆయన కోరారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అయితే తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ పిటిషన్‌పై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.
ఇది కూడా చదవండి: HMPV Virus: భారతీయుల్లో HMPV వైరస్‌కి ‘‘రోగనిరోధక శక్తి’’.. నిపుణుల ప్రకటన..
అయితే జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించారు. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: HMPV Virus: లాక్‌డౌన్ అంటూ వదంతులు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
ఇదిలా ఉంటే ఈ కేసులో విచారణకు సోమవారం ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ వచ్చారు. అక్కడ న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని నిలదీశారు. దీంతో రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరుకాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి సోమవారం నోటీసులిచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunam Trailer: పండుగ ముందే తెచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’