HMPV Virus: ‘‘హ్యుమన్ మెటాన్యూమోవైరస్’’(HMPV), ఈ కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాలో దీని వల్ల వేల సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతం ఈ వైరస్ కారణంగా చాలా ప్రభావితమైనట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే, మన దేశంలో కూడా మూడు కేసులు రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మరో కరోనాలా HMPV మారుతుందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం ఈ వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిందేం లేదని, ఇది ఎప్పటి నుంచో ఉందని చెబుతోంది. అయినప్పటికీ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Yuzvendra Chahal: ఏంటి బ్రో ఇలా దేవాసులా మారిపోయావు.. తప్పతాగిన చాహల్..
అయితే, ఈ వైరస్ మన భారతీయులను ఏం చేయలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా కాలంగా భారతదేశంలో వ్యాప్తిస్తున్న ఫ్లూ వైరస్‌లో భాగమే అని చెబుతున్నారు. అందువల్లే భారతదేశంలోని ప్రజలు దీనికి రోగనిరోధకశక్తిని పెంచుకున్నారని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ అదనపు ప్రొఫెసర్ డా. హర్షల్ ఆర్ సాల్వే అన్నారు. ప్రజలకు ఇమ్యూనిటీ ఉండటంతో తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశాలు చాలా అరుదు అని ఆయన చెప్పారు.
HMPV మొట్టమొదట 2001లో కనుగొనబడింది. ఇది రెస్పరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబంలో భాగం. సాధారణంగా ఈ వైరస్ సోకిన వారికి దగ్గు, జ్వరం, ముక్కులు మూసుకుపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండే పిల్లలు, వృద్ధులల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా బ్రాంకైటిస్, న్యూమోనియాకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది.