Site icon NTV Telugu

Devanand: ఇది కదా సక్సెస్ అంటే.. మృత్యువును జయించి.. నేడు ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా

Deva

Deva

శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పిన స్వామీ వివేకానందా మాటలను నిజం చేశాడు ఆ యువకుడు. తన లక్ష్యం పట్ల అంకితభావం, టార్గెట్ చేధించేందుకు తను చేసిన కృషి నేడు ఆయనను దేశ అత్యున్నత సర్వీసు అయిన ఐఎఫ్ఎస్ అధికారిని చేశాయి. మరణం అంచుల వరకు వెళ్లిన అతడు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌లో 112వ ర్యాంకును సాధించారు. అతను మరెవరో కాదు దేవానంద్ టెల్గోట్. ఇతడు మహారాష్ట్రకు చెందిన యువ సివిల్స్ అభ్యర్థి.

Also Read:Terrorists: సైనికుల దుస్తుల్లో టెర్రరిస్టులు.. భయపడుతున్న కాశ్మీరీలు..

మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన దేవానంద్ తీవ్రమైన కొవిడ్‌ భారినపడ్డాడు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ పాసయి ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలోనే కోవిడ్ సోకింది. మహారాష్ట్రలో కోవిడ్-19 చికిత్స పొందుతున్నప్పుడు, అతని ఊపిరితిత్తుల పరిస్థితి మరింత దిగజారింది. సివిల్స్ అభ్యర్థి కావడంతో, దేవానంద్ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్‌ను సంప్రదించగా, ఆయన KIMS ఆసుపత్రిని సంప్రదించమని సలహా ఇచ్చారు. వెంటనే దేవానంద్‌ను మహారాష్ట్ర నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ లోని బేగంపేట KIMSకు తీసుకువచ్చారు.

నాలుగు నెలలు ఐసీయూలోనే ఉన్నాడు. మరో మూడు నెలలు సాధారణ వార్డులో ఉన్నారు. చికిత్స దశలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. చివరకు ఎక్మో చికిత్సతో కోలుకున్నాడు. ఇంత జరిగినా తన ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోలేదు. ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాడు. అతని ప్రత్యేక అభ్యర్థన మేరకు, UPSC కూడా సానుకూలంగా స్పందించి అతని ఇంటర్వ్యూను మే 5 నుంచి సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది. ఇంటర్య్వూలో ప్రతిభ కనబర్చిన దేవానంద్ టెల్గోట్ తాజాగా విడుదలైన ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో 112వ ర్యాంకును సాధించాడు. తన కలను నిజం చేసుకున్నాడు.

కోవిడ్ పోరులో, ఇంటర్వ్యూలకు మెంటర్‌షిప్‌లో తనకు మద్దతుగా నిలిచిన మహేష్‌ భగవత్‌, ఇతర అధికారులు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. కోవిడ్ ఫైటర్ అయిన దేవానంద్ ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో 112వ ర్యాంకును సాధించడంతో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)-2024 పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఇందులో కనిక అనభ్‌ మొదటి ర్యాంక్‌ సాధించారు. మొత్తం 143 మంది అభ్యర్థులను నియమించాలని యూపీఎస్సీ కేంద్రానికి సిఫారసు చేసింది.

Exit mobile version