Site icon NTV Telugu

CM Revanth Reddy: గో సంర‌క్షణ‌పై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Rr

Rr

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (జూన్ 17న) సాయంత్రం త‌న నివాసంలో స‌మీక్ష నిర్వహించారు. మ‌న సంస్కృతిలో గోవుల‌కు ఉన్న ప్రాధాన్యం, భ‌క్తుల మ‌నోభావాలను దృష్టిలో ఉంచుకోవ‌డంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన చేయాలని అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌క్తులు గోశాల‌ల‌కు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నార‌ని.. స్థలాభావం, ఇత‌ర సమస్యలతో అవి త‌ర‌చూ మృత్యువాత ప‌డుతున్నాయ‌ని సీఎం ఆవేద‌న వ్యక్తం చేశారు. ఆ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించి గోవుల‌ సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వ‌స‌తుల‌తో గోశాల‌లు నిర్మించాల‌ని సూచించారు. ప్రముఖ దేవ‌స్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేముల‌వాడ‌, యాద‌గిరిగుట్ట, హైద‌రాబాద్ న‌గ‌ర స‌మీపంలోని ఎనికేప‌ల్లి, ప‌శు సంవర్థక శాఖ విశ్వ విద్యాల‌యం స‌మీపంలో విశాల ప్రదేశాల్లో మొదట గోశాల‌లు నిర్మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Israel Iran: ‘‘ఒకప్పుడు మంచి మిత్రులు, ఇప్పుడు బద్ధ శత్రువులు’’.. ఇజ్రాయిల్-ఇరాన్ శత్రుత్వానికి కారణం ఇదే..

ఇక, భ‌క్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స‌మ‌ర్పించే కోడెల ప‌ట్ల ప్రత్యేకమైన శ్రద్ధ క‌న‌ప‌ర్చాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేముల‌వాడ స‌మీపంలో వంద ఎక‌రాల‌కు త‌క్కువ కాకుండా గోశాల నిర్మాణం ఉండాల‌ని తెలిపారు. అలాగే, గోవుల సంరక్షణ విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత‌టి వ్యయానికైనా వెనుకాడ‌ద‌ని స్పష్టం చేశారు. అనంత‌రం రాష్ట్రంలో గోశాల‌ల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేప‌ర్‌ను అధికారులు సీఎంకు అంద‌జేశారు. కాగా, వివిధ రాష్ట్రాల్లోని గోశాల విధానాలను అధ్యయనం చేయడానికి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, ఎండోమెంట్స్ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావులతో కూడిన ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Exit mobile version