Site icon NTV Telugu

BJP: ధర్నా చౌక్‌లో బీజేపీ దీక్ష.. పోలీసుల అనుమతి..

ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు బీజేపీ తల పెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎక్కటేలకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్‌ పోలీసులు.. తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా చౌక్‌లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోగా… పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేతలు.. ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. ఇందిరా పార్క్ వద్ద సీఎం ధర్నా చేస్తే ఒప్పు… బీజేపీ దీక్ష చేస్తే తప్పా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే.. అయితే, చివరకు ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Ukraine Russia War: ముగింపు దశకు యుద్ధం..!

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నేడు బీజేపీ తలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ కు పోలీసు యంత్రాంగం అనుమతి ఇచ్చింది… యథావిథిగా దీక్ష కొనసాగుతుంది.. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని.. సాయంత్రం వరకు కొనసాగుతుందని వెల్లడించారు ప్రేమేందర్‌రెడ్డి.. చివరి వరకు అనుమతి ఇవ్వకుండా గందరగోళ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందని విమర్శించిన ఆయన.. కోర్టుకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడటంవల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చివరికి అనుమతి ఇచ్చిందన్నారు.. బీజేపీ ఎమ్మెల్యేలను అకారణంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ సూచనలతో స్పీకర్ శాసనసభలో సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్‌ తిరస్కరించడాన్ని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ చేపట్టనున్నట్టు తెలిపారు.

కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల రోజున గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో బీజేపీ సభ్యులు నినాదాలు చేయడంతో వారిని ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. బ‌డ్జెట్ ప్రసంగానికి అడ్డుప‌డుతున్నారనే కారణంతో ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్నట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రక‌టించిన విషయం తెలిసిందే.

Exit mobile version