హైదరాబాద్‌లోని క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి సహా పలు కీలక ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
మూసీ ఫేజ్–1 టెండర్లు.. మిరాలం ట్యాంక్ పూడిక తొలగింపు
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్–1 పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫేజ్–1లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్–1 ఏగా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్–1 బీగా విభజించి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్–1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని, జనవరి 2027లో పనులు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను జనవరి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించగా, చెరువు అభివృద్ధితో పాటు ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రేడియల్ రోడ్లు, గండిపేట గోశాల పనుల్లో వేగం
రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని సమీక్షలో అధికారులు వివరించారు. రేడియల్ రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, మార్చి 2027 నాటికి పనులు పూర్తయ్యేలా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
పీఆర్టీఎస్ ప్రణాళికలు.. డిపోల వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్
హైదరాబాద్‌లో పీఆర్టీఎస్ (పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) ఫేజ్–1కు సంబంధించిన టెక్నో ఎకానమీ ఫీజిబిలిటీని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయో డైవర్సిటీ వరకు, అలాగే బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు అలైన్‌మెంట్ సాధ్యాసాధ్యాలను వివరించారు. నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్టీఎస్ డిపోలు నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. డిపోల వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, రూట్స్, డిపోల నిర్మాణంపై పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఐఐఐటీ ఫుట్‌బ్రిడ్జి.. కోహెడ ఫ్రూట్ మార్కెట్, చెరువుల పునరుద్ధరణ
సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఐఐఐటీ జంక్షన్ వద్ద నిర్మించనున్న ఫుట్‌బ్రిడ్జి డిజైన్లను కమిషనర్ ముఖ్యమంత్రికి చూపించారు. డిజైన్లను పరిశీలించిన సీఎం పలు సూచనలు చేస్తూ, ఫుట్‌బ్రిడ్జి సమీపంలో ప్రధానంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మెరుగైన రవాణా కోసం మార్కెట్ పనులతో పాటు సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ వివరాలను తెలుసుకున్న సీఎం, అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటును వేగవంతం చేయాలని, నగరంలోని మెట్ల బావుల పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్‌తో పాటు వివిధ శాఖల కమిషనర్లు, ఎండీలు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

