Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..

  • అవయవ మార్పిడికి మెట్రోలో ప్రత్యేక గ్రీన్ కారిడార్
  • 14 కి.మీ. దూరం కేవలం 25 నిమిషాల్లో పూర్తి
  • కేర్ నుంచి కిమ్స్‌కు గుండె, ఊపిరితిత్తుల సురక్షిత రవాణా
  • ప్రాణరక్షణలో మరోసారి మెట్రో సేవలకు ప్రశంసలు
Hyderabad Metro

Hyderabad Metro

హైదరాబాద్ మెట్రో రైలు కేవలం నగరవాసులను గమ్యస్థానాలకు చేర్చే రవాణా వ్యవస్థగానే కాకుండా, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సంజీవనిలా మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. తీవ్రమైన ట్రాఫిక్ చిక్కులను అధిగమించి, అవయవ మార్పిడి చికిత్స కోసం దాత నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను సురక్షితంగా , వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక ‘గ్రీన్ కారిడార్’గా మారింది.

రాయదుర్గ్ నుంచి రసూల్‌పురా.. 25 నిమిషాల్లో 14 కిలోమీటర్ల ప్రయాణం

గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాత నుంచి సేకరించిన గుండె , ఊపిరితిత్తులను సికింద్రాబాద్ పరిధిలోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి అత్యవసరంగా తరలించాల్సి వచ్చింది. రోడ్డు మార్గంలో వెళ్తే ట్రాఫిక్ సమస్యల వల్ల సమయం వృధా అయ్యే ప్రమాదం ఉండటంతో వైద్యులు మెట్రో అధికారులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన హైదరాబాద్ మెట్రో అధికారులు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి రసూల్‌పురా వరకు ప్రత్యేకంగా మెట్రో ట్రాన్సిట్‌ను ఏర్పాటు చేశారు. మార్గమధ్యలో ఉన్న 13 స్టేషన్లను దాటుకుంటూ, కేవలం 25 నిమిషాల్లోనే 14 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసి అవయవాలను సురక్షితంగా చేర్చారు.

సమన్వయంతో విజయవంతమైన ‘లైఫ్ సేవింగ్ మిషన్’

అవయవ మార్పిడి చికిత్సల్లో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్య బృందాలు , మెట్రో సిబ్బంది పరస్పరం పూర్తి సమన్వయంతో వ్యవహరించి ఈ మిషన్‌ను విజయవంతం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో అత్యవసర అవయవాల రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సరైన సమయానికి డోనర్ అవయవాలు కిమ్స్ ఆసుపత్రికి చేరడంతో బాధితుడికి అవయవ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

రవాణాకే కాదు.. ప్రాణరక్షణలోనూ ముందంజ

అత్యవసర వైద్య సేవలకు నిరంతరం అండగా నిలుస్తున్న హైదరాబాద్ మెట్రో సేవలకు నగరవాసుల నుంచి, వైద్య వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిమిషాల విలువను గుర్తించి, కచ్చితమైన ప్రణాళికతో సమయానికి అవయవాలను చేర్చి ఒక ప్రాణాన్ని నిలబెట్టడంలో మెట్రో పోషించిన పాత్ర ప్రశంసనీయం. వేగవంతమైన ప్రయాణానికే కాదు, మానవతా దృక్పథంతో ప్రాణాలు కాపాడటంలోనూ తాను ఎప్పుడూ ముందే ఉంటానని హైదరాబాద్ మెట్రో మరోసారి నిరూపించింది.