Hyderabad Rain Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు కురుస్తాయని ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం కురుస్తుంది. రేపు హనుమకొండ, జనగాం, వరంగల్, మంచిర్యాల, ములుగు, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read also: Astrology: జూలై 14, శుక్రవారం దినఫలాలు
అలాగే 16 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 115.4, అశ్వారావుపేటలో 102.4, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 113.2, నిజామాబాద్ జిల్లా నందిపేటలో 86, నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 84.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో పర్యాయం కొనసాగుతుంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వర్షపాతం లోటు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Sri lakshmi Stotram: సకల సంపదలు చేకూరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి