CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు

  • జనన, మరణ ధ్రువపత్రాల కోసం కొత్త CRS పోర్టల్
  • ఆన్‌లైన్‌లోనే వివరాల నమోదు.. వేగంగా సర్టిఫికెట్లు
  • సేవల్లో పారదర్శకతకు GHMC కీలక అడుగు
  • ఆలస్య నమోదుపై కొత్త చట్టంతో కఠిన నిబంధనలు
Ghmc

Ghmc

CRS Portal : హైదరాబాద్‌ నివాసితులకు గుడ్‌న్యూస్.. జనన, మరణ ధ్రువపత్రాల కోసమని కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు త్వరలోనే చెక్ పడనుంది. ఈ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియలో అనవసర జాప్యాన్ని నివారించి, పౌరులకు సేవలను సులభతరం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ (CRS) పేరుతో ఒకే గొడుగు కిందకు ఒక వినూత్న ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకువస్తోంది. దీని ద్వారా ఇంటి నుంచే సులువుగా వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి వేధింపులు లేకుండా వేగంగా సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు కలగనుంది.

పారదర్శక సేవలే లక్ష్యం.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సమీక్ష

ఇటీవలే జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ రూపకల్పనపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సకాలంలో ప్రాథమిక పౌర సేవలను అందించడం కార్పొరేషన్ బాధ్యత అని గుర్తుచేస్తూ, నూతన ‘సీఆర్ఎస్’ పోర్టల్‌తో ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సవరించిన జనన, మరణాల నమోదు చట్టాలపై అధికారులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించారు.

సవరణ చట్టం-2026: ఆలస్యమైతే కఠిన నిబంధనలు

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం-2026 అమలులోకి వచ్చిన తరుణంలో జీహెచ్‌ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్త చట్టం ప్రకారం.. జనన, మరణ నమోదులో ఆలస్యం జరిగితే కఠినమైన నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏడాదో రెండేళ్లో ఆలస్యమైతే ఆర్డీవో లేదా జిల్లా మేజిస్ట్రేట్ స్థాయి అధికారుల అనుమతి తప్పనిసరి. అదే రెండేళ్లు దాటితే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఉంటేనే గానీ రిజిస్ట్రేషన్ జరగదు. ఇటువంటి చట్టపరమైన చిక్కుల నుంచి సామాన్య ప్రజలను రక్షించి, నిర్దేశిత సమయంలో సేవలు పూర్తి చేసేందుకు ఈ కొత్త ‘సీఆర్ఎస్’ పోర్టల్ ఎంతో దోహదపడనుంది.