హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్ అగత్యాలు, కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. గత ఆరేళ్లుగా సీక్రెట్‌గా డెడ్ డ్రాప్ పద్ధతి ద్వారా దాదాపు 203 మంది కస్టమర్లకు.. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలకు.. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠా, ఆ అక్రమ సంపాదనతో అమానుష దారుణాలకు ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. వరంగల్ సహా ఇతర మారుమూల ప్రాంతాల నుంచి మైనర్లు, పేద అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, వారిని తన వద్దే ఉంచుకుని వరుసగా లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, బాధితులు గర్భం దాల్చిన సందర్భాల్లో వారి కడుపులపై దాడి చేస్తూ, ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా సొంతంగానే అత్యంత ప్రమాదకర రీతిలో అబార్షన్లు చేసినట్లు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ఆర్థిక మోసాలు, బెదిరింపులు..
ఈ క్రూరమైన నెట్‌వర్క్ వెనుక ఆర్థిక మోసాలు, బెదిరింపులు కూడా విపరీతంగా సాగాయి. కిరణ్ ఆ అమ్మాయిల పేరిట తీసుకున్న సిమ్ కార్డులనే గంజాయి వ్యాపారానికి, గూగుల్ పే లావాదేవీలకు వాడుకోవడమే కాకుండా.. ఒక మహిళ అకౌంట్ నుంచే లక్షల రూపాయల డిజిటల్ లావాదేవీలు జరిపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల తల్లిదండ్రులను సైతం తన మాటలతో ట్రాప్ చేసి నమ్మించిన ఈ నిందితుడు, పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేకంగా బెదిరించడానికి ఒక తుపాకీని ఉంచుకోవడంతో పాటు వారిపైకి దాడికి ప్రేరేపించేలా రెండు కుక్కలను కూడా పెంచడం గమనార్హం. అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతూ, గంజాయి సామ్రాజ్యాన్ని నడుపుతున్న బొల్లా కిరణ్ , అతని అనుచరుల నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

