Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు

  • యూట్యూబ్‌లో వీడియోలు చూసి స్కెచ్
  • రూ.2.91 లక్షల నకిలీ నోట్లు సీజ్
  • ప్రింటర్, స్కానర్‌తో మినీ ప్రింటింగ్ ప్రెస్
  • డెలివరీ బాయ్, డ్రైవర్లే ముఠాగా.. ముగ్గురు అరెస్ట్
Fake Currency

Fake Currency

Fake Currency : యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చూసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శంషాబాద్ జోన్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ , బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ నోట్లను, ముద్రణ సామగ్రిని సీజ్ చేశారు.

ఈజీ మనీ కోసం అక్రమ బాట

తెలంగాణలోని వడ్డిపట్ల, చింతల్ తండా ప్రాంతాలకు చెందిన రామావత్ రాము (జొమాటో డెలివరీ బాయ్), రామావత్ మోతీలాల్ (రాపిడో డ్రైవర్), రామావత్ గాంధీ (ఆటో డ్రైవర్) ఈ నేరానికి ఒడిగట్టారు. ప్రధాన నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు తన బంధువైన మోతీలాల్‌తో కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నకిలీ నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నాడు. అనంతరం దానికి కావలసిన ప్రింటర్, స్కానర్, బాండ్ పేపర్లు , రంగులను కొనుగోలు చేసి నివాసంలోనే కరెన్సీ ముద్రణను ప్రారంభించారు.

రాత్రి వేళల్లోనే చెలామణి

తయారు చేసిన నకిలీ నోట్లను గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లోకి పంపేందుకు ఈ ముఠా రాత్రి వేళలను ఎంచుకుంది. జనాలు సందడిగా ఉండే వైన్ షాపులు, కూరగాయల మార్కెట్లలో తక్కువ మొత్తంలో నకిలీ నోట్లను ఇచ్చి అసలు డబ్బులను సొమ్ము చేసుకునేవారు. ఈ పనిలో రాము తన మేనల్లుడైన గాంధీని కూడా భాగస్వామిగా చేసుకున్నాడు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న నాగోల్‌కు చెందిన సుధీర్ జాన్ (అలియాస్ వంశీ) ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

భారీగా సీజ్ చేసిన సొత్తు

పోలీసులు నిందితుల నుంచి రూ.500, రూ.200, రూ.100 నోట్లకు చెందిన మొత్తం రూ.2,91,100 విలువైన నకిలీ కరెన్సీతో పాటు జిరాక్స్ కోసం వాడిన 8 అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నోట్ల తయారీకి ఉపయోగించిన ఎప్సన్ కలర్ ప్రింటర్, స్కానర్, లామినేటర్, పేపర్ కట్టర్, గాంధీ బొమ్మ ఉన్న బాండ్ పేపర్లు, వాటర్‌మార్క్ పేపర్లు, వివిధ రంగుల లిక్విడ్లు, 3 స్మార్ట్‌ఫోన్లు , ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.

పక్కా సమాచారంతో అరెస్ట్

ప్రధాన నిందితుడు రాముపై గతంలో నల్గొండ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదై ఉందని పోలీసులు వెల్లడించారు. నకిలీ నోట్ల చెలామణిపై పక్కా సమాచారం అందడంతో శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ డి. కృష్ణమోహన్, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం పక్కా ప్లాన్‌తో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి విచారణ నిమిత్తం బాలాపూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.