Drunken Drive : నగరంలో వీకెండ్ ట్రాఫిక్ తనిఖీల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వెలుగుచూశాయి. శనివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న 474 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనదారులే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత మూడు చక్రాల వాహన డ్రైవర్లు, కార్లు తదితర నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. తొమ్మిది మందిలో అత్యంత అధిక స్థాయిలో ఆల్కహాల్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే, ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన 474 మందిలో 381 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, 26 మంది మూడు చక్రాల వాహన డ్రైవర్లు, 67 మంది కార్లు తదితర వాహనాలు నడుపుతున్నవారిగా గుర్తించారు. తొమ్మిది మంది డ్రైవర్లలో 100 ఎంఎల్ రక్తంలో 300 ఎంజీ కంటే ఎక్కువగా బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) నమోదైందని అధికారులు తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకర స్థాయిగా పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్లలో ఉన్న ఆల్కహాల్ స్థాయిని ఆధారంగా తీసుకుని కేసులను వర్గీకరించినట్లు తెలిపారు. పట్టుబడిన వారందరినీ సంబంధిత కోర్టుల్లో హాజరు పరుస్తారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, అమాయకుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఈ తరహా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమై ప్రాణనష్టం జరిగితే, భారతీయ న్యాయ సంహిత – 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
TVK Party: టీవీకే పార్టీకి షాక్.. పుదుచ్చేరి సభలో కేవలం లోకల్స్కి మాత్రమే అనుమతి