హైదరాబాద్‌లో నైజీరియన్స్‌తో కలిసి లోకల్ చంటిగాళ్లు డ్రగ్స్ దందా చేస్తున్నారు. వివిధ వ్యాపారాల్లో నష్టాలు మూటగట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఏకంగా డ్రగ్స్ దందా షురూ చేశారు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో ఏకంగా నైజీరియన్స్‌ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 286 గ్రాముల కొకైన్, 11 ఎక్‌స్టసీ పిల్స్, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కంట్రీమేడ్ తుపాకీతోపాటు ఆరు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు…
ఇక్కడ కనిపిస్తున్న డ్రగ్స్ నిందితుల్లో 3 ఇడియట్స్ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు హైదరాబాద్ లోకల్ చంటిగాళ్లు. కానీ గోవా టు హైదరాబాద్, ముంబై టు హైదరాబాద్, బెంగళూరు టు హైదరాబాద్ అంటూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. కొకైన్, ఎక్‌స్టసీ పిల్స్ తెచ్చి తమ వినియోగదారులకు అమ్మేస్తున్నారు…
అలా దందా చేస్తున్న వారిలో రాజస్థాన్ చెందిన జితేంద్ర పవర్ అలియాస్ జిత్తు కూడా ఒకడు. ఇతడు చాలా కాలం క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు. హైదరాబాదులో ఒక స్వీట్ షాప్ ఓపెన్ చేశాడు. కానీ అందులో నష్టాలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే రాజస్థాన్‌లో ఈజీగా దొరికే MD డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్న విధంగానే రాజస్థాన్ నుంచి గత కొన్ని నెలల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడం మొదలు పెట్టాడు. దీని కోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగుని తయారు చేసుకున్నాడు. వారి ద్వారా డ్రగ్స్ అమ్మడం ప్రారంభించాడు. లాభాలు బాగానే వచ్చాయి. ఐతే ఎప్పటికప్పుడు పోలీసుల కన్ను మేజర్ డ్రగ్స్ అమ్ముతున్న వారిపై పడింది. ఎప్పుడైనా సరే పోలీసులు వచ్చి ఇబ్బందులు పెడతారని ఊహించాడు జిత్తు. ఈ నేపథ్యంలోనే బీహార్‌కు వెళ్లి పిస్తోల్‌తో పాటు బుల్లెట్లు కొనుక్కొని తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు జిత్తు పోలీసులకు పట్టుబడడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు..
ఇక నిందితుల్లో మరొకడు ముజఫర్ వహీద్. ఇతను కిరాణా షాప్ పెట్టుకున్నాడు. కిరాణా షాప్‌లో లాభాలు తగ్గడంతో మహారాష్ట్రలో ఉన్న తన మిత్రులను కాంటాక్ట్ చేశాడు. అతి తక్కువ ధరకు డ్రగ్స్ ఇప్పిస్తే హైదరాబాదులో అమ్ముకుంటానని చెప్పాడు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇద్దరు నైజీరియన్స్‌ని ముజఫర్‌కి పరిచయం చేశారు ఫ్రెండ్స్. ముజఫర్ నేరుగా నైజీరియన్స్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులో అమ్మడం మొదలు పెట్టాడు. ఇందుకోసం ముగ్గురితో గ్యాంగుని ఏర్పాటు చేశాడు. బాంబే నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తీసుకు వచ్చేందుకు ఒక డెలివరీ బాయ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం నలుగురు కలిసి ముంబై నుంచి కొకైన్ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులోని పారిశ్రామికవేత్తలకు అమ్మడం ప్రారంభించారు. చాలా కాలం నుంచి ముజఫర్ కొకైన్ పారిశ్రామికవేత్తలకు అమ్ముతున్నట్లు బయటపడింది. మొత్తం 59 మంది పారిశ్రామికవేత్తలు ముజఫర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని పోలీసులు నిర్దారించారు. ముజఫర్‌తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు…
ఇక హర్షవర్ధన్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెద్ద కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. అదే కంపెనీలోని అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు బాగానే ఉన్నా.. ఆమె పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ముందు గంజాయికి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత సింథటిక్ డ్రగ్స్ తీసుకున్నాడు హర్షవర్ధన్. ఈ నేపథ్యంలోనే ఉన్న ఉద్యోగం పోయింది. డ్రగ్స్‌కి డబ్బులు అవసరం అయ్యాయి. గోవాలో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్‌ని హైదరాబాదుకు తీసుకు రావడం మొదలుపెట్టాడు. అత్యంత విలువైన సింథటిక్ డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మకం మొదలు పెట్టాడు. చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సీఈఓలకి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించాడు. గోవా కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న హర్షవర్ధన్‌ని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు…