Chikkadpally Crime: పొరుగింటి యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న నెపంతో జరిగిన ఘర్షణలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఉద్యోగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రామ్మోహన్ (55) గత రెండేళ్లుగా నివాసముంటున్నాడు. ఇతడు డీఆర్‌డీవోలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే, తన ఇంటి పక్కనే నివాసముంటున్న ఓ యువతి పట్ల రామ్మోహన్ గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ క్రమంలో కూడా సదరు యువతిని రామ్మోహన్ మరోసారి తీవ్రంగా వేధించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ యువతి కేకలు వేస్తూ పక్కనే నివాసముంటున్న అభిజిత్ అనే యువకుడికి సమాచారం అందించింది. ఆగ్రహానికి లోనైన అభిజిత్ వెంటనే అక్కడికి చేరుకుని.. గత కొంతకాలంగా యువతిని ఎందుకు వేధిస్తున్నావంటూ రామ్మోహన్‌ను గట్టిగా నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. పరస్పర తోపులాటలో అభిజిత్ బలంగా నెట్టివేయడంతో రామ్మోహన్ కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన రామ్మోహన్‌ను వెంటనే కాచిగూడలోని సీసీ షరాఫ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రామ్మోహన్ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య కాత్యాయిని చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, ఘర్షణకు కారణమైన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు.

