NTV Telugu Site icon

రాజన్న ఆలయానికి.. మేడారం తాకిడి..

దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క జాతర తెలంగాణకే తలమానికం. అయితే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మేడారం జాతర సందర్బంగా వేములవాడ రాజన్న దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది.

స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు విచ్చేశారు. ఈ క్రమంలో స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 4 గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలుపుతున్నారు. అయితే.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఆలయంలో కఠినంగా అమలు చేస్తున్నారు.