ఏపీలో టెన్త్ పేపర్ల లీకులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ఇంటర్ పరీక్షల్లో సంస్కృతం ప్రశ్నాపత్రానికి బదులుగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాలను సూర్యాపేటలో విద్యార్థులకు ఇచ్చారు. తీరా పరీక్ష రాసేందుకు సిద్దమైన విద్యార్థులు సంస్కృతంకు బదులు కెమిస్ట్రీ పేపర్ చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో గంటన్నర ఆలస్యంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే.. నేడు మరో పొరపాటును చేసింది ఇంటర్ బోర్డు. ఈ రోజు ఇంటర్ విద్యార్థులకు పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది.
అయితే.. హైదరాబాద్, నిజామాబాద్ లోని హిందీ మహావిద్యాలయలోని 50 మంది హిందీ విద్యార్థులకు హిందీలో క్వశ్చన్ పేపర్ ఇవ్వాల్సి ఉండగా.. వారికి ఇంగ్లీషులో క్వశ్చన్ పేపర్‌ను ఇచ్చారు. దీంతో ఖంగుతిన్న విద్యార్థులు ఇన్విజిలేటర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో.. హిందీలో క్వశ్చన్ పేపర్‌పై ఆరా తీయగా.. హిందీ మీడియంలో పొలిటికల్ సైన్స్ పేపర్‌ను ఇంటర్ బోర్డు ప్రింట్ చేయలేదని తెలిసింది. దీంతో.. ఇన్విజిలేటర్స్ ఇంగ్లీషులో ఉన్న పొలిటికల్ సైన్స్ పేపర్ ను చేతితో హిందీలో రాసి, విద్యార్థులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రశ్నలు సరిగ్గా అర్థం కాక అన్నింటికీ విద్యార్థులు అవస్థలు పడినట్లు సమాచారం.
