ఈజీ మనీ కోసం జనం అడ్డదారులు తొక్కుతున్నారు. గుప్తనిధుల తవ్వకాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. పాత భవనాలు, దేవాలయాల కింద నిధులు దాచారని తెలిస్తే చాలు వాటిని తవ్విపారేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహముత్తారం మండలంలోని సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దిమడుగు గ్రామ సమీపంలో కొంతమంది తవ్వకాలు జరిపారని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: MEN Menstrual Pain: వరంగల్ నిట్ స్టూడెంట్స్ కొత్త ఆవిష్కరణ.. స్పెషాలిటీ ఏంటంటే?
ఈ సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఆ సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి తవ్వకాలు జరిపినవారి వివరాలు సేకరించారు. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన చిట్యాల, గుట్టల గంగారం, చల్వాయి, కాల్వపల్లి గ్రామాలకు చెందిన తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిలో చెర్ప పాపారావు, మడకం సంతోష్, అలం నారాయణ, సిద్ధబోయిన బతుకయ్య, బొచ్చు హరిబాబు, చిట్టిబాబు. గోడె తిరుపతి, మడకం ఎర్రయ్యలను అరెస్ట్ చేసినట్లు మహముత్తారం ఎస్సై రమేష్ తెలిపారు. గుప్తనిధుల పేరుతో తవ్వకాలకు, క్షుద్రపూజలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read Also:Boy Missig: ఈ నగరానికి ఏమైంది? నిన్న ఇందు.. నేడు నసీర్ మిస్సింగ్
