Heavy Rains In Hyderabad and Floods In Twin reservoirs: మాన్సూన్ ప్రారంభం అయినప్పటి నుంచి భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. మొన్నటికి మొన్న ఎడతెరిపి లేకుండా భాగ్యనగరంలో వర్షం దంచికొట్టింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి, మళ్లీ తాండవం చేసింది. ఇప్పుడు మళ్లీ పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. వికారాబాద్, శంకర్‌పల్లి, పరిగి, షాబాద్, షాద్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని.. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరోవైపు.. జంట జలాశయాలకు భారీగా వరద చేరుతోంది. ఈ నేపథ్యంలోనే హిమాయత్ సాగర్ ఆరు గేట్లను మూడు ఫీట్ల మేర ఎత్తారు. అటు.. గండిపేట ఎనిమిది గేట్లను నాలుగు అడుగులు మేర అధికారులు ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా.. సందర్శకులకు ఎంట్రీ ఇవ్వడం లేదు. కిలోమీటర్ దూరంలోనే వారిని ఆపేశారు. అంతేకాదు.. భారీగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మీడియాను సైతం అనుమతించడం లేదు. పరిస్థితులకు అనుగుణంగా అధికారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా.. ఈ జంట జలాశయాలకు 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది.