ప్రెసిడెంట్ తో సహా మరో నలుగురు జైలుపాలయ్యారు…!! తీగ లాగితే డొంక కదిలి… అందరి బాగోతం బయటపడుతోంది..!! వందల కోట్ల అవినీతి చూసి జనాలు ఛీ కొడుతున్నారు..!! అయినా HCA తీరు మారడం లేదు. నెక్ట్స్ నేనే ప్రెసిడెంట్… నువ్వు సెక్రెటరీ… అని కొందరంటే… నీ బాగోతం కూడా బయటపెడతా… నేనే ప్రెసిడెంట్ అంటున్నాడట మరో పెద్దాయన !! అవినీతి మరకను కడిగిపారేసి.. ఇప్పటికైనా హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపట్టాల్సిందిపోయి.. అవినీతి తిమింగలాల వారసులు పుట్టుకొస్తున్నారట !!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతోపాటు… హెచ్‌సీఏ పెద్దలు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్కపెడుతున్నారు. ఇప్పటివరకు HCA అవినీతి ఆరోపణలు… కేసులే తప్ప అరెస్ట్ ల దాకా వెళ్లింది లేదు. ఫర్ ది ఫస్ట్ టైం… బిగ్ వికెట్స్ పడ్డాయి. అవినీతి ఇన్నింగ్స్ తేటతెల్లమైంది. విజిలెన్స్, సీఐడీ బౌన్సర్లకు హెచ్‌సీఏ అక్రమార్కులంతా క్లీన్ బౌల్డ్ అయ్యారు. జగన్నాటక సూత్రదారి జగన్ తోపాటు… కోట్లు దొబ్బితిన్న తిమింగలాలన్నీ జైలుపాలయ్యాయి.
స్పాట్…
హెచ్‌సీఏ లో వచ్చిన భారీ కుదుపుకు హెచ్‌సీఏ తాజా మాజీలంతా దడుసుకున్నారు. నా బాగోతం బయటపడకుండా చూడు దేవుడా.. అని మొక్కుకోని వాళ్లుండరు !! హెచ్‌సీఏ కి ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తుంటే… సీన్ మరోలా ఉంది. అవినీతి మరకలను తుడిచిపారేసి… ఇకనైనా ప్రక్షాళన చేయాల్సిందిపోయి.. అప్పుడే పావులు కదపటం మొదలుపెట్టారు హెచ్‌సీఏ పెద్దలు. నేనే ప్రెసిడెంట్ అని ఒకరు… నేనే సెక్రెటరీ అని ఒకరు… అసలు నువ్వేలా ప్రెసిడెంట్ అవుతావో నేనూ చూస్తా అని మరొకరు!!! ఇలా పెద్ద యుద్ధమే జరుగుతోంది హెచ్‌సీఏలో.
స్పాట్…
ఏజీఎం.. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవాలి… ! ప్రస్తుతం ఉన్న బాడీని రద్దు చేయాలి. ఎన్నికలకు వెళ్లాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. కానీ.. అప్పుడే ఎన్నికల హీట్ పుడుతోంది హెచ్‌సీఏలో. ఇప్పటికే హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్పందించాడు. అవడకాశం వస్తే.. ప్రెసిడెంట్‌గా పోటీ చేసి హెచ్‌సీఏ ప్రక్షాళన చేపడతా అంటున్నారు. ప్రెసిడెంట్ రేసులో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అనిల్, రోహిన్ రెడ్డి అంటూ… కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా కాంగ్రెస్ నేతలే. అజారుద్దీన్ మినహా… మిగతావాళ్లేవరికీ బ్యాట్, బాల్‌తో పరిచయమే లేదు. ఐనా… రాజకీయ జోక్యం, రాజకీయ నేతల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగితేనే కదా.. హెచ్‌సీఏ తీరు మారేది.
అర్షద్ ఆయుబ్… వివేక్… అజారుద్దీన్… తాజాగా జగన్మోహన్ రావు… ఇలా ప్రెసిడెంట్ కుర్చీలో ఎవరున్నా, ఆడేది మాత్రం అవినీతి ఇన్నింగ్సే !! క్రికెట్ డెవలప్‌మెంట్ తప్ప అన్నీ ఉంటాయి. బాడీ ఏదైనా… బీసీసీఐ నుంచి వస్తున్న నిధులను అప్పనంగా తినడంలో ఆరితేరారు. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం…. గెలవడం… ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుకు పదింతలు తిని మమ అనిపించడం !!! అందరితీ ఇదే తీరు. అంతా ఆయారామ్… గయారామ్ లే!!
అసలు క్రీడా సంఘాల్లో క్రీడాకారులుండాలి కానీ… రాజకీయ నాయకుల జోక్యాలు ఎందుకు..? బ్యాట్ పట్టింది లేదు… బాల్ వేసింది లేదు… అసలు క్రికెట్ ఓనమాలు తెలియకపోయినా… ఎన్నికల బరిలో ఉంటారు కొందరు. వీళ్లంతా సంఘాల్లోకి ఎలా ఎంట్రీ ఇస్తున్నారు. క్రికెట్ క్లబ్బులు ఎలా నడుపుతున్నారు..? వీళ్లకే ఆట రానప్పుడు… క్లబ్ పెట్టి క్రికెటర్లను ఎలా తయారు చేస్తారు..?
స్పాట్..
క్రికెట్ అసోసియేషన్స్ లో రాజకీయ పార్టీల జోక్యం ఎక్కువైంది. హెచ్‌సీఏ మొదలుకుని… జిల్లా క్రికెట్ క్లబ్‌ల వరకు పాలిటీషియన్లదే హవా. అసోసియేషన్లలో రాజకీయ ప్రమేయమే ఉండకూడదు అని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్ట్రిక్ట్ రూల్. కోట్లకు కోట్లు నిధులు ఇస్తున్న బీసీసీఐ… మీ స్టేట్ నుంచి ప్లేయర్లు ఎందుకు తయారు కావడం లేదని ప్రశ్నించదు !! క్లబ్ సెక్రెటరీలూ అడగరు ! హెచ్‌సీఏ లో ఏం జరుగుతుందో కామన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి అసలు అర్థమే కాదు..
2023 సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పటికే అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ పదవీ కాలం ముగియడం…. అజ్జూ భాయ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో… సుప్రీం కోర్ట్ ఆదేశాలతో అప్పట్లో HCA ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనే యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA పేరుతో పోటీ చేశాడు జగన్మోహన్ రావు. ప్రత్యర్థి అమర్నాథ్ పై చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. ఒకే ఒక్క ఓటుతో గెలిచారు. అప్పటివరకు జగన్మోహన్‌రావుకి HCA తో ఎలాంటి సంబంధాలు లేవు… క్రికెట్ క్లబ్ లేదు… క్రికెట్ క్లబ్‌లతో పరిచయమే లేదు.. !! అసలు జగన్మోహన్ రావు అంటేనే ఎవరికీ గిట్టలేదు. ఐనా ప్రెసిడెంట్‌గా గెలిచేశాడు.
ఎన్నికలకు ఒక నెల ముందు మాత్రమే సభ్యత్వం తీసుకొని ఏడాది నుంచి తాను మెంబర్ నేనని.. నమ్మించి హెచ్సిఏ అధ్యక్షునిగా గెలిచాడు జగన్మోహన్ రావు. అప్పటిదాకా తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా…. ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ చైర్మన్ గా… హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జగన్మోహన్ రావు… ఉన్నట్టుండి HCA ప్రెసిడెంట్ అయిపోయారు. కారణం జగన్మోహన్ రావు వెంట ఉన్న పొలిటికల్ పవర్.
హెచ్‌సీఏ లో అవినీతి అంటే…. కేవలం సొమ్ము నొక్కేయడమే కాదు ఇంకా చాలానే ఉన్నాయి. దశాబ్ధాల కాలంగా అందులో పాతుకు పోయిన కొందరు మెంబర్స్ కూడా హెచ్‌సీఏ పరువు బజారుకీడుస్తున్నారు. పి. యాదగిరి ఈయన… ఏ మెంబర్ స్థాయి నుంచి వైస్ ప్రెసిడెంట్ వరకు అన్ని పదవులు చేపట్టారు. 26 ఏళ్ల పాటు హెచ్సిఏ లోనే ఉన్నారు. పిఆర్ మాన్సింగ్… జాయింట్ సెక్రెటరీగా… సెక్రటరీగా ఉంటూ పాతికేళ్లుగా పాతుకుపోయారు. ఎన్ శివలాల్ యాదవ్.. ఈసీ మెంబర్ నుండి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. 24 ఏళ్లుగా హెచ్సిఏ లోనే ఈయన మకాం !! జాన్ మనోజ్ … ఈసీ మెంబర్ గా మూడు సార్లు… సెక్రెటరీగా ఒకసారి చేశారు. ఈయన 22 ఏళ్లుగా హెచ్సిఏ లోనే ఉంటున్నారు. సురేందర్ కుమార్ అగ్రవాల్ ఈసి మెంబర్ నుండి ట్రెజరర్… వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. హెచ్సిఏ లో ఈయన సీనియారిటీ 19 ఏళ్ళు !! విజయానంద్… ఈసీ మెంబర్ స్థాయి నుండి సెక్రెటరీ పొజిషన్ వరకు 19 ఏళ్లుగా తిష్ట వేశారు.
గోపాల్ 18 ఏళ్లుగా ఈసీ మెంబర్ గానే కొనసాగుతున్నారు. జి వినోద్ వైస్ ప్రెసిడెంట్ గా రెండు సార్లు ప్రెసిడెంట్ గా మరో రెండు సార్లు చేసి 18 ఏళ్లుగా పాతుకుపోయారు. అర్షద్ ఆయూబ్.. ఈసీ మెంబర్ గా మొదలై రెండు సార్లు ప్రెసిడెంట్ గా చేసి 16 ఏళ్లుగా హెచ్సిఏ లోనే ఉన్నారు. నరేందర్ గౌడ్ ఈసీ.. మెంబర్ గా వైస్ ప్రెసిడెంట్ గా చేసి 16 ఏళ్లుగా కొనసాగుతున్నారు. పురుషోత్తం అగర్వాల్ జాయింట్ సెక్రెటరీగా మూడు సార్లు చేశారు. 16 ఏళ్లుగా హెచ్సిఏ లోనే ఉంటున్నారు. నరేష్ శర్మ ఈసీ మెంబర్ గా ట్రెజరర్ గా జాయింట్ సెక్రెటరీగా చేసి 15 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఎస్ వెంకటేశ్వరన్ 15 ఏళ్లుగా హెచ్సిఏ లోనే తిష్ట వేశారు.
1934 లో ఏర్పడిన హెచ్‌సీఏ కి తొలుత 10 క్లబ్బులున్నాయి. 1960 కి వచ్చేసరికి 30 క్లబ్బులుగా.. మారింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ తో క్లబ్ ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ క్లబ్బులే… హెచ్‌సీఏ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. క్లబ్లులే హెచ్‌సీఏ పీఠంలో ఎవరుండాలి అని డిసైడ్ చేస్తాయి. ఒకప్పుడు హెచ్‌సీఏ చెప్పిందే వేదంలా పాటించే క్లబ్బులు… ఇప్పుడు హెచ్‌సీఏను ఆదేశించే స్థితికి చేరుకున్నాయి క్లబ్బులు. క్లబ్బులు డిసైడ్ ఐతే… వార్ వన్ సైడే !!
స్పాట్…
క్రీడాకారులను గుర్తించి… శిక్షణ ఇచ్చి… వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత క్లబ్బుల మీద ఉంది. కానీ… ఏ ఒక్క క్లబ్ ఈ పని చేయదు. తమ పిల్లలు… బంధువుల పిల్లలు… స్నేహితుల పిల్లలు… లేదా డబ్బులిచ్చిన వాళ్ల పిల్లలు… బడా పారిశ్రామిక వేత్తలు, పొలిటికల్ లీడర్ల పిల్లలకు మాత్రమే చోటు కల్పిస్తారు. కొందరు పొలిటీషియన్లు… రాజకీయనేతలకు కూడా క్లబ్బులున్నాయి. కారణం.. క్లబ్బులున్నవాడు వీళ్లకు లీజుకు ఇస్తున్నారు. ఇయర్లీ 15 లక్షలకి 20 లక్షలకి లీజుకి ఇస్తున్నారు.
అంత డబ్బులు పెట్టి లీజుకు తీసుకున్నవాడు ఊరికేఉంటాడా..? డబ్బును ఎలాగైనా సంపాధించుకోవాలాలనే చూస్తాడు..? అప్పుడే అసలు కథ మొదలుపెడతాడు. మీకు బౌలింగ్ చేయడం వచ్చా…! బ్యాటింగ్ లో అనుభవం ఉందా..! పర్ఫెక్ట్‌గా రానక్కర్లేదు.. అంతంతమాత్రంగానే వచ్చా..! అయితే మీరు చిటికెలో రంజీ ప్లేయర్ ఐపోవచ్చు. నచ్చిన ట్రోఫీలో ఆడే ఛాన్స్ మీసొంతం. డబ్బులు వెదజల్లితే చాలు. డివిజన్‌లీగ్‌కి ఒకరేటు.. బీసీసీఐ టోర్నీలకు ఒకరేటు.. రంజీలకు మరొకరేటు చొప్పున రేటు కడతాడు. పైసా పేకో.. క్రికెట్ ఖేలో అని బోర్డు పెట్టేస్తాడు.
క్రికెటర్ కావాలని… టీం ఇండియాకి ఎంపికవ్వాలని కలలుకంటూ.. ఆ దిశగా అహర్నిశలు కష్టపడుతున్న యువకులు ఎందరో ఉన్నారు. రంజీ ప్లేయర్ అయినా అవ్వాలని… బీసీసీఐ లీగ్స్, కనీసం డివిజన్ లీగ్స్ కైనా ఆడాలని శ్రమిస్తున్నారు. కానీ… వీళ్ల క్రికెట్ జీవితానికి చరమగీతం పాడుతుంటాయి క్రికెట్ క్లబ్స్. వాళ్ల ఆశలను అడియాశలు చేస్తూ… కష్టపడి శ్రమించిన వాళ్లను కాదని… కాసులు వెదజల్లేవాళ్లనే క్రికెటర్లుగా మారుస్తున్నాయి. లీగ్ కో రేటు పెడుతూ…. లక్షల రూపాయలు దండుకుంటున్నాయి. క్రికెట్ ఓనమాలు తెలియని వారిని సైతం… రంజీ ప్లేయర్ స్థానానికి తీసుకెళ్తున్నాయి క్రికెట్ క్లబ్స్.
ఏమాత్రం సత్తా లేని ప్లేయర్ల ఎంపిక వెనుక అదృశ్యశక్తులున్నాయి. ప్రతిభను కొలమానంగా తీసుకొని టీమ్‌లో స్థానం కల్పించే రోజులు పోయాయి. ఎవరి చేతిలో ఎక్కువ క్లబ్‌లు, ఎవరు ఎక్కువ డబ్బులు ముట్టచెబితే వాళ్ల పిల్లలే హైదరాబాద్ తరఫున ఆడడం ఆనవాయితీగా మారిపోయింది. హెచ్‌సీఏ కూడా పేరుకు తగ్గట్టే… హైదరాబాద్ కే పరిమితమైంది. జిల్లాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఆ ఊసే ఉండదు.
పరుగులు చేయకపోయినా పర్వాలేదు. వికెట్లు తీయలేకపోయినా నష్టం లేదు. లాబీతో మంచి పరిచయాలుండి వారు అడిగింది ఇస్తే ఏ టోర్నీలోనైనా ఆడేయొచ్చు. రెండ్రోజులు, మూడ్రోజుల డివిజన్ లీగ్‌లో ఆడే జట్లలో చోటు మొదలు రంజీ జట్టులో స్థానం వరకు ప్రతిదానికీ ఒక రేటు పెట్టి అమ్ముకుంటున్నారు. డివిజన్ లీగ్‌లో ఆడాలంటే 25 వేల నుంచి 50 వేల రూపాయలు… బీసీసీఐ టోర్నమెంట్లలో బరిలోకి దిగేందుకు 10 నుంచి 20 లక్షలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆటగాళ్లను పక్కనపెట్టి పైరవీల ద్వారా వచ్చిన క్రికెటర్లను ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీకి ఎంపిక చేస్తున్నారు హెచ్‌సీఏ పెద్దలు.
అసలు క్లబ్బులు నిర్వహించాలంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏ ఒక్కటీ ఉండవు !! ఒక టీమ్ ఉండాలి… ఓ మేనేజర్ ఉండాలి.. కోచ్ ఉండాలి రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఉండాలి మానిటరింగ్ ఉండాలి కానీ ఇవి ఏ క్లబ్బూ చేయదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌సీఏ పరిధిలో 217 క్లబ్బులుంటే… హైదరాబాద్ లోనే 209 ఉన్నాయి. మిగతా ఎనిమిది క్లబ్బులు ఉమ్మడి ఎనిమిది జిల్లాల నుంచి ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న క్లబ్బులో ఆడితేనే టీమ్ కి ఎంపికయ్యే ఛాన్స్ ఎక్కువ. జిల్లాల్లో ఉన్న క్లబ్బుల నుంచి ఎంపికై… టీమ్ ఇండియా దాకా కాదు కదా… రంజీ టీమ్‌కి ఎంపికవడం కూడా కలే. లక్షల రూపాయలు ఇచ్చి ఆడే పరిస్థితి జిల్లా ప్లేయర్లకు ఉండదు.
డబ్బులు తీసుకుని ఆడిపిస్తున్నప్పుడు … వాళ్ళలో ప్రతిభ లేనప్పుడు… ఆటగాడు ఎక్కడిదాక పోతాడు. ఎంత పుష్ చేసినా.. ఎక్కడిదాక వెళ్లగలరు…!!! మహా ఐతే హైదరాబాద్ రంజి ట్రోఫీ దాకా మాత్రమే !!
హెచ్‌సీఏ పరిధిలో ఉన్న 217 క్లబ్బులు… కొందరు వ్యక్తుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. కొందరు బాడాబాబులు ఈ మొత్తం 217 క్లబ్బులను తమ అధీనంలో పెట్టుకొని ఆడిస్తున్నారు. నిజం చెప్పాలంటే… HCA ని గబ్బు పట్టిస్తుందే క్లబ్బులు !! క్లబ్బుల కారణంగానే.. హెచ్‌సీఏ పరిస్థితి దిగజారిపోయింది. ముఖ్యంగా నరేందర్ గౌడ్… విజయానంద్… శివలాల్ యాదవ్… హర్షద్ ఆయుబ్… పురుషోత్తం అగర్వాల్… సురేందర్ అగర్వాల్.. మొయినుద్దీన్… మహమ్మద్ !! వీళ్లే చక్రం తిప్పేది. పేరుకే 217 క్లబ్స్ !!! ఈ కింగ్ పిన్స్ ఒక్కొక్కరి దగ్గర 30 నుంచి 40 క్లబ్బులు ఉంచుకుని… ఆపరేట్ చేస్తుంటారు. వీళ్లు క్లబ్బులు నడపడమే కాదు… ప్లేయర్ల తలరాతను … హెచ్‌సీఏ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంటారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి… ప్రెసిడెంట్‌గా ఎవరుండాలి…? ఎవరు సెక్రటరీ… ఎవరు ట్రెజరీ ఇలా… ప్రతీది డిసైడ్ చేసేది కూడా ఈ కింగ్ పిన్సే !! మొత్తం వీళ్ళు చెప్పినట్టే నడవాలి… !! వీళ్లు డిసైడ్ చేసే బాడీనే కాబట్టి… ప్లేయర్లుగా ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా వీళ్లే డిసైడ్ చేస్తారు. టాలెంటెడ్ క్రికెటర్లు… బయట ప్రైవేట్ మ్యాచులు ఆడుకోవాల్సిందే ! ఇలా ఎంతో మంది ట్యాలెంటెడ్ క్రికెటర్లని తొక్కిపెట్టిన పాపాన్ని సైతం మూటగట్టుకుంది హెచ్‌సీఏ.
డిస్ట్రిక్ట్ క్లబ్బులంటే హెచ్‌సీఏ కి చిన్నచూపు ! గ్రామీణ ప్రాంత ప్లేయర్లు అంటే అంటరాని వారిగా చూస్తుంది !! కానీ.. అసలు ట్యాలెంట్ ఉండేదే రూరల్ క్రికెట్‌లో. ప్రస్తుత టెస్ట్ టీమ్ కెప్లెన్ శుభ్‌మన్ గిల్ వచ్చింది కూడా పంజాబ్ రాష్ట్రంలోని పాకిస్తా సరిహద్దులో ఉన్న చెక్ జైమాల్ సింగ్ నుంచి..!! ఐపీఎల్ సంచలనం.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ వైభవ్ సూర్యవంశి బీహార్ లోని తేజ్పూర్ !! ప్రస్తుతం టెస్ట్ టీమ్‌లో ఆడుతున్న ఆకాష్ దీప్ ఫాస్ట్ బౌలర్ బీహార్ లోని కుగ్రామం. నటరాజన్ తమిళనాడులోని సేలం దగ్గర ఓ చిన్న గ్రామం నుంచి వచ్చాడు. ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డ్స్ అన్ని గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టడం వల్లే.. సంచలన ప్లేయర్లుగా తయారయ్యారు.
మరి తెలంగాణ నుండి ఒక్కరు కూడా రావడం లేదంటే… 33 జిల్లాల్లో ఒక్క టాలెంటెడ్ క్రికెటర్ కూడా లేడనా !! కోట్ల మందిలో ఒక్క క్రికెటర్ ను తయారు చేయలేకపోతుంది. ఒక్కరిని కూడా టీం ఇండియాకు పంపించలేకపోతుంది. కారణం హెచ్సిఏ పనితనం అంతా అవినీతి చుట్టూ తిరగడం వల్లే. రూల్ ప్రకారం జిల్లాకో క్లబ్ పెట్టాలి. కానీ పాతికేళ్లుగా ఒక్క క్లబ్ ను కూడా పెంచింది లేదు. 2000 లో ఎన్ని క్లబ్బులున్నాయో ఇప్పుడూ అన్నే ఉన్నాయి. ఆయా జిల్లాకి చెందిన క్లబ్… అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఇలా వివిధ కేటగిరీల్లో క్రికెట్ మ్యాచ్‌లు పెట్టాలి. ఆ మ్యాచ్ లో ఎవరు సత్తా చాటారో వాళ్ళని ఎంపిక చేసి హెచ్సిఏ కు పంపాలి. ఇది జిల్లాల్లోని క్లబ్బులు చేయాల్సిన పని. కానీ ఒక్క జిల్లా క్లబ్ కూడా ఈ పని చేయడం లేదు.
బిసిసిఐ నుండి HCA కి ఏటా 100 కోట్ల రూపాయల ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ ని ఈ 217 క్లబ్బులు పంచుకుంటాయి. పేరుకు.. మాత్రమే మ్యాచ్లు ఆడించామని చూపించి డబ్బు దండుకుంటాయి. నిజంగా మ్యాచ్లు నిర్వహించి ఉంటే అన్ని జిల్లాలు సీరియస్ గా వర్కవుట్ చేసి ఉంటే ఎంతో మంది క్రికెటర్స్ తయారయ్యేవాళ్ళు. కానీ అలా జరగడం లేదంటే అర్థం బిసిసిఐ ఇచ్చే డబ్బు కోసమే క్లబ్ లు నడుపుతున్నారని.
ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా చేకూరి వెంకట్… హైదరాబాద్ జిల్లాకు ప్రదీప్… నల్గొండ జిల్లాకు శ్రీనివాస్… మెదక్ జిల్లాకు రాజేందర్ రెడ్డి… కరీంనగర్ జిల్లాకు ఆగంరావు… వీళ్ళంతా కొన్నేళ్ల పాటు అధ్యక్షులుగా తిష్ట వేశారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఎవరు వచ్చినా… ఏ కొత్త బాడీ ఎన్నికైనా… తొత్తుగా మారడం… వాళ్ళ జోబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఏదో మమ అనిపించినట్లు… అప్పుడప్పుడు రెండు మూడు జట్ల మధ్య సరదాగా మ్యాచ్‌లు పెడుతుంటారు. వేలల్లో ఖర్చైతే… లక్షల్లో బిల్లు వేసి దొబ్బితింటుంటారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఊసే లేదు.
రాజు గుర్రం గాడిద అయినట్టే… హెచ్‌సీఏ బాటలోనే జిల్లా క్లబ్బులు నడుస్తున్నాయి. అందరు కలిసి క్రికెట్ ను వ్యాపారంలా మార్చేశారు. కొన్ని క్రికెట్ క్లబ్బుల్లో 50 ఏళ్ళు పైబడిన వాళ్లు కూడా ఆటగాళ్లుగా ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొత్త వాళ్లను రానివ్వరు.. పాత వాళ్లు పోరు…!!