NTV Telugu Site icon

HarishRao: ఉస్మానియాలో 50 కీళ్ళుమార్పిడి ఆపరేషన్లు

ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటళ్ళలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ దార్శనికత పేదలకు మోయలేని భారాన్ని తగ్గిస్తున్నదన్నారు.

ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉస్మానియాలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీంతో అత్యాధునిక వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయని మంత్రి తెలిపారు. సిద్ధిపేటలోని 23వ వార్డులో శ్రీరక్ష తల్లి, పిల్లల నవజాత శిశువుల దవాఖానను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ బీరప్ప కామరాతి కళ్యాణోత్సవం వేడుకలకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.

45 ఏళ్లు పైబడిన వారిలో మోకాళ్లలో సమస్య ఎక్కువగా వస్తుంది. వందలో 40 మందికి పైగా మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులు.. మొత్తం నాలుగు దశల్లో సమస్య తీవ్రత చాటుతుంది. మొదటి, రెండు దశల్లో సాధారణ నొప్పులతో ఇంటి వరకే ఉంటుండగా.. తరువాత ఆసుపత్రులు చుట్టూ తిరగాలి. సమస్యకు పరిష్కారం లభించక పోతే వత్తిడి పెరుగుతుంది.

కీలు మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా మోకాలి చిప్ప వెనుక భాగంలో ఉన్న ఎముకలను సవరించి.. కొంత మేర తొలగించి స్టీల్‌ రకం కృత్రిమ కీలు అమర్చుతారు. తొడ ఎముక, కాలు ఎముక కలిపే చోట ఈ మార్పు చేస్తారు. సాధారణంగా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్సకు రూ.2 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తుంటారు. అయితే తెలంగాణలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మోకాళ్లకు పట్టీలు అమర్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రులోనే లభ్యం కావడంతో పేదలకు మరింత వెసులుబాటు కలుగుతోంది. ఈ తరహా వైద్యం పేదలకు భారంగా మారకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ తరహా కాస్ట్లీ ఆపరేషన్లు చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు.