Harish Rao : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా “బాకీ కార్డులు” పంచి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బకాయిల ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు.
మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. “ఆరు గ్యారంటీలు సహా అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని విస్మరించింది. ఈ పరిస్థితి మారాలంటే రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే కాంగ్రెస్‌కు బుద్ధి వస్తుంది,” అని వ్యాఖ్యానించారు. ముస్లింల సంక్షేమం పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. “ముస్లింలకు ఇస్తామన్న ప్రత్యేక బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ముస్లిం వ్యక్తిని ఉపముఖ్యమంత్రిగా చేసిన ఘనత మాత్రం కేసీఆర్‌దే,” అని ఆయన గుర్తుచేశారు.
అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా హరీష్ రావు తీవ్రంగా దాడి చేశారు. “కొడంగల్ నియోజకవర్గంలో మస్జిద్‌లు, దర్గాలను కూల్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అన్ని వర్గాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమైంది,” అని చెప్పారు. చివరిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “డబ్బులు, మద్యానికి అమ్ముడుపోవద్దు. కాంగ్రెస్ పెట్టే ప్రలోభాలను ఎడమచేత్తో నెట్టేసి బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ చేసిన పనులను గుర్తుంచుకోండి,” అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
