కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ లేకుండా అసలు అవార్డులే లేవని. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద దేశంలో 20 గ్రామాలు ప్రకటిస్తే తెలంగాణలోని 19 గ్రామాలకు అవార్డులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ బండి సంజయ్ తొండి సంజయ్ అని.. రేవంత్ రెడ్డిది గోబెల్స్ ప్రచారం అని విమర్శించారు. బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత చత్తీస్ గఢ్ లో అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బిల్లులు ఇవ్వలేదని కాంగ్రెస్, బీజేపీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు రూ. 700 కోట్లు చెల్లింపులు జరిగాయని.. ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే వారం రోజుల్లో సర్పంచులకు చెల్లిస్తాని అన్నారు. కేంద్రం నుంచి రూ. 1200 కోట్ల ఉపాధి హామీ నిధులు రావాలని హారీష్ రావు అన్నారు. బండి సంజయ్ నువ్వు ఉత్తరం రాయాల్సింది సర్పంచులకు కాదు.. కేంద్రానికి అని అన్నారు. కేంద్రం తెలంగాణకు రూ.8,995 కోట్లు బాకీ ఉంది బండి సంజయ్ ముందుగా వీటి గురించి మాట్లాడు అని హరీష్ రావు సవాల్ విసిరారు.
13వ ఆర్థిక సంఘం నుంచి రూ. 1129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 817 కోట్లు, 15వ ఆర్థిక సంగం రూ.1103 కోట్లు, విభజన చట్టం కింద రూ. 1350 కోట్లు, జీఎస్టీ బకాయిలు రూ. 4142 కోట్లు మొత్తంగా రూ. 8,995 కోట్లు రావాలని దీని గురించి ఉత్తరం రాయాలని బండి సంజయ్ ని డిమాండ్ చేశారు. కేంద్రం ఇవ్వకపోయినా.. మా సర్పంచులకు ఇబ్బంది కావద్దని మా ఖజానా నుంచి డెవలప్మెంట్ పనులు చేయించాం అని అన్నారు.
మిషన్ భగీరథకు, కాకతీయకు రూ. 24,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెబితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్ షా వచ్చి తిట్టడం తప్పితే మీకు వేరే పని లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలా దేశంలో ఏ రాష్ట్రమైనా ఉందా..? అని ప్రశ్నించారు. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు తెలంగాణలో 99.98 శాతం ఉన్నాయని కేంద్రమే చెప్పింది అని.. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ విధంగా ఉందా..? అని అడిగారు. తండాలను పంచాయతీలుగా మార్చన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని..కాంగ్రెస్, బీజేపీ ల ట్రాప్ లో పడొద్దని.. ఈ రెండు పార్టీలు అభివృద్ధి నిరోధకులని విమర్శించారు.