సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు భీమా అందక ఇబ్బందులు పడుతున్న 22 మంది రైతు కుటుంబాలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించారు. రైతు భీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో రైతు కుటుంబాలతో కలిసి ముఖ్యమంత్రి నివాసం ముందు ధర్నా నిర్వహించడంతో పాటు సక్రెటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతు కుటుంబాల కష్టాలు కనిపించడం లేదా అని నిలదీశారు. కరెంట్ కోతల విషయంలో అధికారులను సస్పెండ్ చేయడం కాదని, బాధ్యులైన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలను సస్పెండ్ చేయాలని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలో అండగా.. నేడు రోడ్డుపాలు
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రైతాంగానికి అన్ని విధాలా సంక్షేమ పథకాలు అందాయని హరీష్ రావు గుర్తుచేశారు. భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు, బోరుబావులకు 24 గంటల ఉచిత విద్యుత్, కాల్వల ద్వారా పొలాలకు సాగునీరు అందించామని తెలిపారు. ముఖ్యంగా అన్నదాత ఏ కారణం చేతనైనా మరణిస్తే, కేవలం 11 రోజుల్లోనే ‘రైతు బీమా’ ద్వారా రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా ఆ కుటుంబాల ఖాతాల్లో జమ చేసి కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆగస్టు నుంచి రైతు బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసిందని ధ్వజమెత్తారు.
ఆగిపోయిన ఎల్ఐసీ ప్రీమియం.. నిర్లక్ష్యంలో ప్రభుత్వం
గత ఏడాది ఆగస్టు 14 నుంచి ఎల్ఐసీకి చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వాలు నిలిపివేయడంతోనే రైతు బీమా పథకం నిలిచిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 3 వేల మంది రైతులు మరణించినప్పటికీ, వారికి బీమా అందక ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీస సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు భీమా పథకం కోసం కేవలం రూ. 1400 కోట్లు కేటాయించే ఆర్థిక స్థోమత లేదా? లేక రైతులను ఆదుకునే మనసు లేదా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

