Harish Rao: కాంగ్రెస్ నేతల మాటలు, కాంగ్రెస్ హమీలపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మూడు గంటలు కరెంట్ చాలన్న ఆయన నిన్న నారాయణఖేడ్ వచ్చాడని, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇస్తామని, ఆ రాష్ట్ర ఓటర్లను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ఉన్న గోచి ఊడిపోయిందని అన్నారు.
READ ALSO: Vivek: భూస్వాములకు రైతుబంధు ఎందుకు..? కౌలు రైతులకు అండగా కాంగ్రెస్..
తెలంగాణ మేం పెట్టిన భిక్ష అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారని, బ్రిటీష్ వాళ్లు మనకు స్వాతంత్రం ఇచ్చారని, అదికూడా బ్రిటీష్ వారు పెట్టిన భిక్షనేనా.? అని ప్రశ్నించారు. మిస్టర్ ఖర్గే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలో ఖర్గే సొంతూరికి కరెంట్, నీరు లేవని విమర్శించారు. మమ్మల్ని నమ్మి కర్ణాటక ప్రజలు ఓటేస్తే, మీ జాడ, పత్తా లేదని ఎద్దేవా చేశారు.
రిస్క్ వద్దు కారుకి ఓటు గుద్దు అని ఓటర్లను అభ్యర్థించారు. కర్ణాటకలో ఖజానా ఖాళీ అయిందన్నారు. కాంగ్రెస్ దొంగమాటలు నమ్మవద్దని, కేసీఆర్ ఏది హామీ ఇస్తే దాన్ని నెరవేరుస్తారంటూ భరోసా ఇచ్చారు. నవంబర్ 30న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిలకు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.