Site icon NTV Telugu

Half Day Schools : చిన్నారుల రక్షణే ముఖ్యం.. పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీలకు హాఫ్ డే స్కూల్స్

Anganwadi

Anganwadi

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో, చిన్నారుల ఆరోగ్యం , భద్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల సమయాలను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది చిన్నారులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది. ప్రస్తుతానికి ఈ ఒంటిపూట బడుల విధానం ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల చిన్నపిల్లలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అంగన్‌వాడీ చరిత్రలోనే గత ఏడాది నుంచి ఈ ఒంటిపూట బడులు , వేసవి సెలవుల విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.

Global Trade Crisis: ఇప్పటికే హర్మూజ్‌ మూసివేత.. మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..

ఈ ఏడాది కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. సమయాలు మారినప్పటికీ, లబ్ధిదారులకు అందే పౌష్టికాహార పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ‘టేక్ హోం రేషన్’ (Take Home Ration) ద్వారా గర్భిణులు, బాలింతలు , చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని యథావిధిగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. దీనివల్ల కేంద్రాలు త్వరగా మూసివేసినప్పటికీ, లబ్ధిదారులకు అందాల్సిన పోషకాలు నేరుగా వారి ఇళ్లకే చేరుతాయి. ఒంటిపూట బడుల గడువు ముగిసిన తర్వాత, నెల రోజుల పాటు ఇచ్చే వేసవి సెలవుల గురించి ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. చిన్నారుల క్షేమమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల పట్ల అంగన్‌వాడీ సిబ్బంది , తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Global Trade Crisis: ఇప్పటికే హర్మూజ్‌ మూసివేత.. మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..

Exit mobile version