NTV Telugu Site icon

Rain in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. వికారాబాద్‌లో వడగండ్ల వాన

Rain In Telangana

Rain In Telangana

Rain in Telangana: గత వారం పది రోజులుగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. కానీ నేడు తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, కూకట్‌ పల్లి, దిల్‌షుక్‌ నగర్‌ పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, లంగర్ హౌస్, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఆరంఘర్ లలో వర్షం దంచి కొడుతోంది. ఇక మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. జహీరాబాద్‌లో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. వాన రాకతో హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. నగరంలో వర్షం కురుస్తుండటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది.

వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. మర్పల్లి మండల కేంద్రంలో వడగళ్ల వాన కురిసింది. వికారాబాద్, పరిగి, పూడూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత వారం పది రోజులుగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఊరట లభించింది. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా.. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణకు కదులుతున్న ద్రోణి తుపాను బుధవారం ఒడిశా వైపు వెళ్లిందని, తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడినట్లు తెలిపింది.

పది జిల్లాల్లో వానలు..

ఈరోజు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది. రేపు (శుక్రా), శని, ఆదివారాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక.. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. కాగా.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని వెల్లడించారు.
Bandi Sanjay: రోడ్డు మీద సెల్ఫీలు దిగుతా వారితో సంబందం ఉన్నట్టా? అఖల్ ఉండాలి అనడానికి..