Site icon NTV Telugu

Gold Bag Theft: బైక్ పై వచ్చి సినీ ఫక్కీలో బంగారం బ్యాగ్ చోరీ

Donga

Donga

దొంగలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుపోతున్నారు. పక్కవారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా.. చాలా ఈజీగా చోరీలు చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. భద్రాచలంలో అదే జరిగింది. చాలా సులువుగా.. ఏ మాత్రం కష్టపడకుండా.. ఎవ్వరికి కొంచెం కూడా అనుమానం రాకుండా.. బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అంతా అయిపోయాక చూసుకుంటే తన ఆభరణాలు మాయం అయ్యాయని గ్రహించాడో వ్యక్తి.

బూర్గంపాడుకు చెందిన సత్యవ్రత.. భద్రాచలంలోని యూబీరోడ్డులో ఉన్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో కొన్ని రోజుల కింద బంగారు ఆభరణాలు దాచుకున్నాడు. మే 16 మధ్యాహ్నం పదకొండు సమయంలో.. బ్యాంకు లాకర్​ నుంచి తన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. వాటిని ఓ బ్యాగులో పెట్టుకొని ద్విచక్రవాహనానికి తగిలించిన ఓ పెద్ద సంచిలో ఉంచాడు. అక్కడి నుంచి బయలుదేరిన సత్యవ్రత.. ఓ దుకాణం దగ్గర కవర్లు కొనేందుకు ఆగాడు.సత్యవ్రతను ఓ ఇద్దరు యువకులు గమనిస్తూనే ఉన్నారు.

అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. సత్యవ్రత కవర్లు కొనే దుకాణం దగ్గర అగి. బైక్​పైనే కూర్చున్న సత్యవ్రత.. ముందుకు మాత్రమే చూస్తూ తనకు కావాల్సింది కొంటున్నాడు. దొంగ మాత్రం.. ఏమాత్రం హడావుడి లేకుండా చాలా సింపుల్​గా.. సంచిలో ఉన్న బంగారం బ్యాగును తీసేందుకు ప్రయత్నించాడు. కానీ.. మొదటిసారి ప్రయత్నం విఫలమైంది. చుట్టూ జనసంచారం ఉన్నప్పటికీ ద్విచక్రవాహనదారులు వస్తున్నా ఎలాంటి ఆందోళన పడకుండా.. దొంగ ఇంకోసారి ప్రయత్నించి సక్సెసయ్యాడు. చాకచక్యంగా బంగారం బ్యాగును కొటేశాడు. బ్యాగ్ ని తీసుకుని వెనకకు తిరగకుండా.. హాయిగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ అతని కోసం ఎదురుచూస్తున్న మరో దొంగ బైక్ ఎక్కి పరారయ్యాడు. ఆ బైక్​ ఎక్కి ఇద్దరు ఎంచక్కా తప్పించుకున్నారు.

కాసేపటి తర్వాత చూసుకోగా.. సంచి బైక్​ నుంచి ఊడిపోయినట్టు కనిపించింది. అందులోని బంగారం బ్యాగు మాయం అయ్యింది. తన ఆభరణాల బ్యాగును ఎవరో దొంగిలించారని గుర్తించిన సత్యవ్రత.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగులో లక్షా 80 వేల విలువగల బంగారు ఆభరణాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన ప్రదేశంలోని కేసులో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమేరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Langer House: లంగర్ హౌజ్ లో దారుణం… తన ప్రేయసికి హాయ్ చెప్పాడని కత్తితో దాడి

Exit mobile version