NTV Telugu Site icon

గోదారమ్మను కాటేస్తున్న కాలుష్యం

లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లమందికి తాగునీరు అందిస్తున్న మహానది గోదావరి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అవుతోందా? భద్రాచలం వద్ద గోదావరి కాలుష్య కాసారంగా తయారైందా? గోదావరిలో మునిగితే రోగాలు గ్యారంటీనా? అంటే అవుననే అంటున్నారు. గోదావరికి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలోకి కెమికల్ నీళ్లు వచ్చి చేరుతున్నాయ్. పంటలు సాగు చేయటానికి ఆ నీటినే వాడుతున్నారు. అలా పండిన పంటలను తిని జనం రోగాల పాలవుతున్నారు. కలుషిత నీటిని తాగి ఆస్పత్రుల్లో చేరుతున్నారు జనం.

తెలంగాణలో గోదావరి ప్రవాహం అంతా కొండాకోనల మధ్య నుంచే వస్తుంది. భద్రాచలం నాలుగు రాష్ట్రాలకు కూడలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి డ్రైనేజీ నీళ్లన్ని గోదావరిలోనే కలుస్తున్నాయి. గోదావరిలోకి మురుగు నీటిని శుద్ది చేయకుండానే పంపిస్తున్నారు. ఈ నీటినే పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తాగిన జనం అనారోగ్యం పాలవుతున్నారు.

భద్రాచలంలో ఆరు స్లూయిజ్‌లు ఉన్నాయి. ఆ స్లూయిజ్‌ల నుంచి భద్రాచలానికి చెందిన మురుగు నీరంతా గోదావరిలోనే కలుస్తుంది. భద్రాచలంలో డంపింగ్ యార్డు లేదు. పట్టణం చుట్టు ఒక్కవైపు గోదావరి ఉండగా..మరో వైపున ఆంధ్రా ప్రాంతం ఉంది. దీంతో పట్టణంలో చెత్త వేయడానికి కూడా స్థలం లేదు. గోదావరి కరకట్ట వెంట గోదావరిలోనే మొత్తం చెత్త అంతా వేస్తున్నారు. చెత్తతో ఇప్పుడు కరకట్ట వెడల్పుగా తయారైంది. పట్టణంలోని చెత్త, వైద్యశాలల నుంచి వచ్చే వేస్టేజీ గోదావరిలోనే వేస్తున్నారు. అదే గోదావరిలో కలుస్తుంది. గోదావరి బాగా వచ్చినప్పుడు కొట్టుకునిపోతుంది. ఇప్పుడు గోదావరి తీరం డంపింగ్ యార్డుగా తయారైంది.

గోదావరి నీటిని ఆధారంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు నిర్మిస్తున్నారు. గోదావరి పక్కనే ఐటిసి ఆధ్వర్యంలో పేపర్ బోర్డు నిర్మాణం జరిగింది. ఇది అంచెలంచెలుగా విస్తరించింది. అతి పెద్ద బహుళ జాతి సంస్థ కూడ. వారు తమ కెమికల్ నీటితో గోదావరిని కాలుష్య కాసారంగా తయారు చేస్తున్నారు. పేపర్ బోర్డులో నుంచి బయటకు వెళ్లే నీరు అంతా ఒక్క వరద కాలువ మాదిరిగా వెళుతుంది. ఈ కాలువ వెళ్లే దారిలో మనం ముక్కు మూసుకున్న కూడ నిలబడలేనంత దుర్వాస వస్తుంది.

గోదావరిలోకి రెండు చోట్ల ఈ కాలుష్య కారకమైన నీటిని ఐటిసి విడుదల చేస్తుంది. ఇంత దారుణంగా పట్ట పగలే నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నప్పటికి ఎవ్వరు ఏమీ అనరు. ఇక్కడ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఎటువంటి ఆందోళనలు చేయరు. అధికారులు అంతా ఆ కంపెనీ చేతిలో కీలుబొమ్మలుగా ఉంటారు. ఇక్కడి పోలీసు యంత్రాంగం ఆ కంపెనీ చేతిలో వ్యక్తులుగా ఉంటారు. ఐటిసి మీద ఎవ్వరు ఏమి మాట్లాడొద్దు. ఇంత కాలుష్య కారకాలను విడుదల చేస్తున్నప్పటికి ఇక్కడ నోరు విప్పడం మహా నేరంగా ఉంటుంది.

కొత్తగా ఇటీవల కాలంలో బిటిపిఎస్ నిర్మాణం చేపట్టారు. తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకు మణుగూరు వద్ద భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. నాలుగో యూనిట్‌ కూడా పూర్తి చేసుకుని విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. రాష్ర్టంలో విద్యుత్ కొరతను నివారించడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మాణం చేశారు. గోదావరి నుంచి విద్యుత్ ప్లాంట్ నీటిని తీసుకుంటుంది. ఆ తరువాత అదే నీటిని వదలడానికి యాష్ ప్లాంట్ నిర్మాణం చేశారు. ఐతే ఈనీళ్లు అన్ని ఇప్పుడు గోదావరిలోనే కలుస్తున్నాయి. ఇప్పుడు మణుగూరు ప్రాంతంలోని గోదావరి నీళ్లు అన్ని విద్యుత్ ప్లాంట్ నుంచి వచ్చిన కలుషిత నీటితో నిండిపోయాయి. గోదావరి మీద తెప్పలాగా కనిపిస్తుంది.

ఇదే నీటిని ఇక్కడి ప్రజలు తాగుతున్నారు. పంట పొలాలకు సాగు నీటిగా ఉపయోగ పడుతుంది. మరోవైపు ఈప్రాంతంలో చేపల వేట సాగుతుంది. ఈ పొల్యూషన్ నీటి వల్ల గోదావరిలో చేపలు కూడా బతకడం లేదు. చేపలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. గతంలో బిటిపిఎస్ నిర్మాణ సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. లేటెస్టు టెక్నాలజీతో నిర్మాణం సాగుతుందని అందువల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదని చెప్పుకొచ్చారు. కాని మూడు యూనిట్ల నిర్మాణం వరకు గోదావరిలో పొల్యూషన్ రాలేదు. ఇప్పుడు నాలుగో యూనిట్ నిర్మాణం తరువాత పొల్యూషన్ వచ్చి పడుతుంది. దీంతో ఇక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. మొత్తం మీద అటు గోదావరి కాలుష్య కాసారంగా తయారైంది. పొల్యూషన్ వల్ల నీళ్లన్ని విషతుల్యంగా మారుతున్నాయి. ఈ నీటిని జనం తాగుతున్నారు. అవే నీటిని పంట పొలాలకు వాడుతున్నారు. దీంతో ఇప్పుడు గోదావరి గరళ గోదావరిగా తయారవుతోంది.